Home / SLIDER / తెలంగాణ భవన్ -జ‌యించిన ధ‌ర్మ‌మా.. ఇదీ నీ చిరునామా!

తెలంగాణ భవన్ -జ‌యించిన ధ‌ర్మ‌మా.. ఇదీ నీ చిరునామా!

1969 జూలై 20వ తేదీన అమెరికన్‌ వ్యోమగామి నీల్‌ ఆమ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై పాదం మోపిన ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఊపిరి బిగబట్టి వీక్షించారు. ఆమ్‌స్ట్రాంగ్‌ విజయాన్ని తమ విజయంగా భావించి పొంగిపోయారు. ‘ఒక మానవుడి అడుగు, మానవ జాతికి పెద్ద అంగ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ మరిచిపోలేనివి.

1947 ఆగస్టు 15న ఇండియా గేట్‌ సమీపాన ప్రిన్సెస్‌ పార్క్‌ మైదానంలో తొలి ప్రధాని నెహ్రూ పతాకావిష్కరణ జరిపినప్పుడు సైనికులు ముందు అనుకున్నట్టుగా కవాతు జరపలేకపోయారు. లెక్కలేనంత మంది తరలిరావడంతో, కిక్కిరిసిన జనం మధ్య నుంచి వెళ్ళి పతాకావిష్కరణ నెహ్రూకు కష్టమైపోయింది. పతాకావిష్కరణ చేస్తున్న నెహ్రూ జనం ఆకాంక్షలకు, ఉద్వేగానికి ప్రతీకగా మారిపోయారు.

చరిత్రలో కొన్ని అరుదైన ఘట్టాలుంటాయి. ఒక మనిషిలో జాతి యావత్తూ తనను తాను దర్శించుకున్న సందర్భాలవి. అతడి అడుగు జాతి ముందడుగుగా భాసిల్లుతుంది. రేపు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి భవన నిర్మాణానికి పార్టీ అధినేత, ఉద్యమ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేయబోయే ఘట్టం చరిత్రాత్మకమైనది.

తెలంగాణ విజయ యాత్రలో ఇది మరో మైలురాయి. ఇదొక అస్తిత్వ ముద్ర. ఒక్క తెలంగాణ సమాజమే కాదు, తమ వనరులు తమకే దక్కాలంటూ ప్రపంచవ్యాప్తంగా పోరాడుతున్న అనేక తెగలు, జాతులు, కోట్లాది మంది భూమిపుత్రులు గర్వంగా పొంగిపోదగిన ఘడియ ఇది. భిన్న జాతులు, విభిన్న ఆకాంక్షలు గల మన దేశంలో రాజకీయ వ్యవస్థ స్వభావ రీత్యా సమూల మార్పునకు గురవుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి దేశ రాజధానిలో సొంత భవనాన్ని నిర్మించుకుంటున్నది. టీఆర్‌ఎస్‌ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే ఒక అసాధారణ విజయం. సాధించిన తర్వాత రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న తీరూ అద్వితీయం. ఇప్పుడు దేశ రాజకీయ స్వరూపాన్ని, పరిపాలనా దృక్కోణాన్ని మార్చాలని నిర్ణయించడం ద్వారా సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నది.

తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్‌ హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌ను నిర్మించారు. అప్పటి టీఆర్‌ఎస్‌ స్థాయి లేదా ఉద్యమ పరిస్థితితో పోలిస్తే అంత పెద్ద భవనం అవసరాన్ని అర్థం చేసుకోలేదు. కేసీఆర్‌ స్థాయితో ఆలోచిస్తేనే ఆ భవనం ఎందుకు నిర్మించారనేది తెలుస్తుంది. తెలంగాణ భవన్‌లో వివిధ విభాగాలకు వసతి ఏర్పాటుచేశారు. పది మంది ఫోన్‌లలో మాట్లాడుకోవడం వేరు, ఒక్కసారిగా కలుసుకోవడం వేరు. కలిసి భోజనం చేయడం ఇంకా వేరు. ఆ తేడా కేసీఆర్‌కు తెలుసు. కేసీఆర్‌ నివాసానికి మించిన మేధోమథన కేంద్రం మరొకటి ఉండదు. ఉద్యమ సమయంలో ఆయనను కలుసుకోవడానికి వచ్చినవారికి తెలుసు. ఒక పది నిమిషాలు కలుసుకోవడానికి వచ్చినవారు గంటల కొద్దీ చర్చిస్తూ ఉంటారు. రాత్రి కావచ్చు, పొద్దు పొడవవచ్చు. వచ్చినవారి నుంచి అనేక విషయాలు గ్రహిస్తారు. వచ్చినవారికి అనేక విషయాలు ఆకళింపు చేస్తారు. ఒక చర్చ కోసం లోపలికి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు మనిషిలో ఎదుగుదల కనిపిస్తుంది. అందుకే కేసీఆర్‌ భవనాలకు- చర్చలకు ప్రాధాన్యం ఇస్తారు. తెలంగాణ భవన్‌లో అనేక మందికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.

కరీంనగర్‌లో కూడా తెలంగాణ భవన్‌ ఏర్పాటైంది. ఇప్పుడు ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలు ఏర్పడుతున్నాయి. ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గ కేంద్రాలలో సొంత కార్యాలయాలు ఉండాలనే ఆలోచన కేసీఆర్‌ చెప్పేవరకు ఎవరికీ రాలేదు. రైతులు చర్చించుకోవడానికి రైతు వేదిక భవనాలను నిర్మించారు. ప్రజలు ఆలోచించకూడదు, ఎక్కువ మంది జమ కాకూడదని నియంతలు కోరుకుంటారు. కానీ సంఘ సంస్కర్తలు సమావేశాలను, మేధోమథనాలను ఆశిస్తారు. ప్రజలు తెలివిన పడాలని ఆరాటపడతారు.

ప్రగతిభవన్‌ కట్టినప్పుడు ఎన్ని విమర్శలు! మన తెలంగాణలోనే కొందరు ‘దద్దమ్మలు’ ఆ ప్రదేశంలోని జాగను కూడా లెక్కగట్టి గింత డబ్బు ఖర్చు పెడతరా అని విమర్శించారు. కేసీఆర్‌ తాపత్రయ పడేది సొంత ఇల్లు కోసం కాదుగదా! అది ముఖ్యమంత్రి భవనం. అదొక అస్తిత్వ చిహ్నం. భవిష్యత్‌ తరాలకు వారసత్వంగా, గర్వకారణంగా ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం గురించి ప్రపంచమంతా చెప్పుకొంటే మంచిదే కదా! పాత సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ వంద మంది భోజ నం చేసే ఏర్పాటు లేదు. ఆ ఇరికిరుకు భవనాన్ని చూపి ఇదే మా ముఖ్యమంత్రి కార్యాలయం అంటే ఎలా ఉంటుంది? ఇప్పు డు ప్రగతిభవన్‌లో సబ్బండ వర్ణాలతో చర్చలు జరుపుతున్నారు. అదొక సంక్షేమ భవన్‌గా మారిపోయింది. సచివాలయ స్థలంలో భారీ సముదాయం నిర్మిస్తామంటే, దానికీ అనేక అడ్డంకులు సృష్టించి ఆపించే ప్రయత్నం చేశారు.

బ్రిటిషర్లు నిర్మించిన రాష్ట్రపతి భవన్‌, పార్లమెంట్‌ భవనం ఇప్పటికి ఉపయోగకరంగా ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న మనం భావితరాలు గర్వపడే విధంగా ప్రగతిభవన్‌, సచివాలయం వంటివి నిర్మించుకుంటే తప్పేమిటి?

కాకతీయ వైభవానికి, కళారీతికి సంకేత మైన శిల్ప తోరణం మన వారసత్వ సంపద. గోల్కొండ కోట మన గత వైభవ ప్రతీక. నిర్మాణ చాతుర్యం మన సొంతం. తెలంగాణలో రాజసం ఉట్టిపడే భవనాలు నిర్మించుకోవడం కొత్త కాదు. ‘ఆ వంక అసెంబ్లీ హాలు, ఈ వంక జూబిలీ హాలు..’ అంటూ సినారె రాసిన పాట చాలామంది వినే ఉంటారు. అందమైన ఉద్యానవనాల మధ్యలో ఈ మందిరాలను నిజాం కాలంలో నిర్మించారు. అసెంబ్లీ భవనం సరేసరి. జూబిలీ హాలు ఇప్పటికీ సభలు, సమావేశాలకు వేదిక. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రధాన భవనం ఆర్ట్స్‌ కళాశాలను చూడటానికి సందర్శకులు వస్తుంటారు. చౌమహల్లా ప్యాలెస్‌ నిజాం కాలంలో రాజపీఠం. ఫలక్‌నుమా ప్యాలస్‌ను ఇంగ్లిష్‌ ఆర్కిటెక్ట్‌ విలియం వార్డ్‌ మారెట్‌ చేత నిర్మించారు. బ్రిటన్‌ ఐదవ జార్జి రాజు, మేరీ రాణి, మూడవ ఎడ్వర్డ్‌, రష్యా చివరి చక్రవర్తి (జార్‌) రెండవ నికోలస్‌ మొదలైన అతిథులు ఇక్కడ బస చేశారు. రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ కూడా ఇక్కడే ఆతిథ్యం స్వీకరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమా ర్తె, సలహాదారు ఇవాంక వచ్చినప్పుడు కూడా ఈ భవనంలోనే విడిది చేశారు. ఒకప్పటి భవనాలను గొప్పగా చెప్పుకొంటున్నాం. మరి భవిష్యత్‌తరాలు గర్వపడే భవనాలను మనం నిర్మించి వారసత్వంగా ఇవ్వకూడదా? పరాయి శక్తులకు దాసోహం అనే బుద్ధిజీవులు మన అభివృద్ధికి అడ్డుపడుతూనే ఉంటారు. హుస్సేన్‌ సాగర్‌ నీటిని శుద్ధిచేసి, అందులోని కలుషిత మట్టిని కుప్పపోసి ఒక దీవిగా మార్చి, జలాశయానికి రెండువైపులా ఆకాశహర్మ్యాలు నిర్మిస్తే, భాగ్య నగరానికి చిహ్నంగా ప్రపంచమంతా చూపవచ్చునని కేసీఆర్‌ భావించారు. దానికీ కొందరు గగ్గోలుపెట్టారు, అడ్డుపుల్లలు వేశారు.

1930 దశకంలోనే కోల్‌కతా మహా నగరంలో బస చేయడానికి నిజాం భారీ భవనాన్ని కొనుగోలు చేశారు. ఆర్మీనియన్‌ జాతీయుడు కట్టించిన ఆ రాజభవనంలో ఎనిమిదవ ఎడ్వర్డ్‌ రాజు వంటి ప్రముఖులు విడిది చేసేవారు. ఆ చరిత్రాత్మకమైన రాజభవనాన్ని నిజాం కొనుగోలు చేయడంతో ‘నిజాం పాలస్‌’గా మారింది.

సౌదీ అరేబియాలోని మక్కాలో కూడా హైదరాబాద్‌ నుంచి వెళ్లే యాత్రికులకు ఉచిత బస కోసం మన భవనాలున్నాయి. ఇప్పుడు ఆ బస ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. ఢిల్లీ నడిబొడ్డున ఒకప్పుడు నిజాం విడిదిగా విలసిల్లిన ‘హైదరాబాద్‌ హౌజ్‌’ గురించి తెలియని వారుండరు. దీన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. ఇప్పుడు అమెరికా, యూకే వంటి అగ్ర దేశాల అధినేతలకు ప్రధాని ఇచ్చే అధికారిక విందులు రాజసం ఉట్టిపడే ఈ హైదరాబాద్‌ హౌజ్‌లోనే జరుగుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నుంచి పోయే వారికి ఏపీ భవన్‌లో వసతి ఇవ్వకపోయేవారు. దీంతో వారు హోటళ్ళలో బస చేసే అక్కడినుంచి తిరగవలసి వచ్చేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన వంతు వాటా వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున వసతి ఉండటమే కాకుండా, ఇప్పుడిక టీఆర్‌ఎస్‌ పార్టీ సొంత భవనాన్ని నిర్మిస్తున్నది. ఇతర ప్రాంతాలలో మన ఉనికిని, ప్రాధాన్యాన్ని చాటుకునే ఘనమైన వారసత్వాన్ని కొనసాగిస్తున్నది.

పరాయి రాజకీయశక్తులు స్థానిక వనరులను దోచుకపోయే ముఠాలుగా ఉంటాయి. మన శ్రేయస్సును కోరవు. అందువల్ల సమాజానికి ఎన్ని ఆకాంక్షలున్నా, ఎదుగుదలకు ఎన్ని వనరులున్నా, ఒక జాతిగా మనుగడ సాధించాలనుకుంటే, ఇతర జాతులకు బానిస కాకూడదనుకుంటే అందుకు సొంత రాజకీయ అస్తిత్వం ఉండాలి. స్వీయ రాజకీయపక్షమే జాతి ఆకాంక్షలను, రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చగలదు. తెలంగాణ రాష్ట్ర సమితి సాధించిన విజయం ఇదే. ఢిల్లీలో భవనం నిర్మించుకొని చాటదలుచుకున్న సత్యమిదే. ఢిల్లీలో తెలంగాణ భవనం దేశవ్యాప్తంగా ఉన్న బలహీనవర్గాలకు గొంతుకగా మారుతుంది. బలహీనుల ఆకాంక్షలకు విజయమార్గం చూపుతుంది. ప్రగతి కాముకులకు దిశానిర్దేశం చేస్తుంది.

ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి భవనాన్ని నిర్మిస్తున్నారనగానే రెండు విషయాలు స్ఫురణకు వస్తాయి. అందులో ఒకటి-భవనాల ప్రాధాన్యాన్ని కేసీఆర్‌ గుర్తించడం. రెండవది- ఢిల్లీలో భవనం నిర్మిస్తున్న సందర్భం.

కేసీఆర్‌ రాజకీయ వ్యూహచతురుడిగానే చాలా మందికి తెలుసు. కానీ ప్రతి అంశంలోనూ ఆయన దార్శనికత కనిపిస్తుంది. ప్రతి కార్యాచరణకు తాత్విక భూమిక ఉంటుంది. పైకి సాధారణమైనవిగా కనిపించే అంశాల వెనుక లోతైన ఆలోచన ఉంటుంది.

మానవ పురోగతి క్రమంలో- ఒక దశలో మనుషులు గుహల్లో నివసించారు. ఆ తర్వాత ఇండ్లు నిర్మించుకోవడం మొదలైంది. క్రమంగా భవనం అనేది వ్యక్తి లేదా కుటుంబ అవసరంగానే కాకుండా, సమిష్టి ప్రయోజనంగా, విజ్ఞానకేంద్రంగా, పరిపాలనా కేంద్రంగా, కళారూపంగా, అస్తిత్వ చిహ్నంగా రూపుదిద్దుకున్నది. ఈ తాత్వికతను అర్థం చేసుకున్న నాయకుడు కేసీఆర్‌.

పక్షి గూడును నిర్మించుకుని దానిలో గుడ్లు పెడుతుంది. పల్లె వాసులకు తెలిసి ఉంటుంది, గిజిగాడు అనే పక్షి ఎంత అందమైన గూళ్ళు పెడుతుందో. గాలి ఎంత వీచినా చెట్టుకు ఊగుతుందే తప్ప గూడు పడిపోదు. గూడు లోపలికి దిగి వెళ్ళేలా ఉంటుంది. కనుక గుడ్లు బయటకు పడిపోవు. ఆ గూడు నిర్మాణంలో ఎంతో కళాత్మకత ఉంటుంది.

సింధులోయ కాలంలో నగర ప్రణాళిక వెల్లివిరిసింది. భూగర్భ జలవ్యవస్థ ఉన్నది. ఆ లెక్కన మనం ఎక్కడున్నట్టు? గురుకులాలైనా, ఆరామాలైనా భవనం అనేది నలుగురు కూడే చోటు! అక్కడ మేధోమథనం జరుగుతుంది. సమాజం పురోగమిస్తుంది. రచ్చబండ అయినా రాజ సభ అయినా సమిష్టితత్వానికి, సమావేశాలకు చిహ్నమే. మనుషుల సమిష్టి తత్వాన్ని పోది చేసే కేసీఆర్‌ ఆలోచనలో భాగమే భవనాల నిర్మాణం. తెలంగాణ సమాజం గురించిన ఆయన కల అది.

బలహీనులకు నిరాశ వలదు..
సంకల్పమే అసలు బలం..
ఇదీ టీఆర్‌ఎస్‌ నిరూపించిన సత్యం.

ప్రాంతీయ ఆకాంక్షలను
ప్రాంతీయ పార్టీలే నెరవేరుస్తాయి..
ఇదీ టీఆర్‌ఎస్‌ నిరూపించిన సత్యం.

లక్ష్యమూ, మార్గం ధర్మబద్ధమైతే విజయం తథ్యం..
ఇదీ టీఆర్‌ఎస్‌ నిరూపించిన సత్యం.

కుట్రలు, కుయుక్తులు, పైరవీలు,
లాబీయింగ్‌లు ఎల్లకాలం నిలువలేవు..
అంతిమంగా ప్రజా సంకల్పమే గెలుస్తుంది..
ఇదీ టీఆర్‌ఎస్‌ నిరూపించిన సత్యం.

ఆయుధాలతో, హింసా
విద్వేషాలతో ఉద్యమాలు గెలువవు..
ప్రజాస్వామిక యుగంలో
శాంతిమార్గమే సాఫల్య కారణం..
ఇదీ టీఆర్‌ఎస్‌ నిరూపించిన సత్యం.

మెజారిటీ -రాజకీయానికి
భయపడనవసరం లేదు..
ప్రజాబలం, గుండెబలం ఉంటే
ఎంతటి శక్తులనైనా ఓడించవచ్చు..
ఇదీ టీఆర్‌ఎస్‌ నిరూపించిన సత్యం.

అస్తిత్వ పోరాటాలకు అనంతకాలం
పడుతుందనే నిరాశ వద్దు..
అనతి కాలంలోనూ ఆశయాలను సాధించవచ్చు..
ఇదీ టీఆర్‌ఎస్‌ నిరూపించిన సత్యం.

ఈ దేశం అనేక రాష్ర్టాలు,
అనేక జాతుల సమాహారం..
సమైక్యతకు సమాఖ్య పాలనే పరిష్కారం..
ఇదీ టీఆర్‌ఎస్‌ నిరూపించిన సత్యం.

ఢిల్లీ పురవీధుల్లో సగర్వంగా
శిరసు ఎత్తి నిలబడే టీఆర్‌ఎస్‌ భవనం..
అస్తిత్వ కాంక్ష ఉన్న అన్ని జాతులకూ స్ఫూర్తి, మార్గదర్శి.

ఢిల్లీ వసంత్‌ విహార్‌ రోడ్డుమీది నుంచి వెళ్లే
సామాన్యులకూ, సార్వభౌములకూ..
బలహీనులకూ, బాధాతప్తులకూ..
ప్రతి ఒక్కరికీ టీఆర్‌ఎస్‌ భవనం ఒక భద్ర ముద్ర.
అస్తిత్వ ఆశ్వాసన. కర్తవ్య బోధ..
ఢిల్లీలో సౌధం కేవలం పార్టీ భవనం కాదు
అది తెలంగాణ జన జయ నినాదం..

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ భవనం..
తెలంగాణ ప్రజా పోరాటాల ప్రతీక..
ఆధిపత్య రాజకీయాలకు హెచ్చరిక.

ధర్మానిదే గెలుపని జాతికిచ్చే సందేశం..
ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి భవనం.

యతో ధర్మస్తతో జయః

ఢిల్లీలో 8.77 ఎకరాల విస్తీర్ణంలో చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 1928లో నిర్మించిన ‘హైదరాబాద్‌ హౌస్‌’ ఇది. నాటి రాచరికపు వైభవానికి, అద్భుత నిర్మాణ కౌశలానికి నిదర్శనంగా నిలిచిన ఈ భవనం.. నేటికీ ఢిల్లీలోని సమావేశ మందిరాలకు తలమానికంగా భాసిల్లుతున్నది. అమెరికా, జర్మనీ తదితర అగ్రరాజ్యాధినేతలు భారత్‌కు విచ్చేసినప్పుడు జరిగే ఉన్నతస్థాయి సమావేశాలకు వేదికగా ఈ భవనాన్ని భారత ప్రభుత్వం ఉపయోగిస్తున్నది. ఇది నాటి తెలంగాణ ప్రజలు ఢిల్లీపై వేసిన చెరగని ముద్ర.

-స‌హ్య‌