ఈటల నిర్లక్ష్య ధోరణివల్ల నియోజకవర్గంలో ఒక్క కుటుంబానికి కూడా డబుల్ బెడ్ రూం ఇల్లు రాలేదని, తనను గెలిపిస్తే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఐదు వేల నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తానని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. కమలాపూర్ మండలం దేశరాజ్‌పల్లెలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, పేర్యాల రవీందర్‌రావుతో కలిసి శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడారు.
హుజూరాబాద్ ప్రజలు ఈటల రాజేందర్‌ను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఒక్క మహిళా భవనం కూడా కట్టలేకపోయాడని మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ నాలుగు వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయిస్తే.. ఇంతవరకూ ఒక్కరితో కూడా గృహప్రవేశం చేయించని అసమర్థ నేత ఈటల రాజేందర్ అని దుయ్యబట్టారు. తన స్వార్థం కోసమే ఈటల రాజేందర్ అబద్ధాల బీజేపీలో చేరి జూటా మాటలతో జనాలను ఆకర్షించేందుకు యత్నిస్తున్నాడని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన పార్టీ బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న బీజేపీ.. కనీసం ఏడాదికి 50 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీజేపీకి ఓటేస్తే మనకు ఒరిగేది శూన్యమన్నారు.తనను భారీ మెజార్టీతో ఆశీర్వదిస్తే ఇన్నిరోజులూ ఈటల రాజేందర్ చేయలేని పనులను చేసి చూపిస్తానని గెల్లు శ్రీనివాస్‌యాదవ్ స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం తనకుందని చెప్పారు. నియోజకవర్గంలో గూడులేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు. అలాగే, హుజూరాబాద్‌కు మెడికల్ కాలేజీ వచ్చేలా కృషిచేస్తానని చెప్పారు. తనకు ప్రజాసేవ తప్ప వేరే వ్యాపారాలేమీ లేవని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేస్తానని గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ శైలజానాగేందర్, ఉప సర్పంచ్ మిట్టపల్లి సుభాశ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజ్‌కుమార్, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.