తెలంగాణలో దళిత బంధు కార్యక్రమం అద్భుతమైనదని.. ఆ పథకం కింద దళితులకు కేవలం రూ.10 లక్షలు ఇవ్వడమే కాదు.. ఇదివరకు దళితులకు లేని ఎన్నో రిజర్వేషన్లను ఈ స్కీమ్ ద్వారా కల్పిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ ఇవాళ పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు.
ఈసందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఇదివరకు దళితులకు రాని ఎన్నో ఫెసిలిటీలను ఇప్పుడు అందిస్తున్నామని తెలిపారు.ప్రతి రంగంలో దళితులకు కూడా రిజర్వేషన్లు కల్పించడమే దళిత బంధు ముఖ్య ఉద్దేశం. విదేశీ విద్యలో కూడా పేద విద్యార్థులకు 20 లక్షలు ఇచ్చి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాం. అద్భుతమైన పెట్టుబడులు వస్తున్నాయి. దేశం కిందికి పోతాఉంది. రాష్ట్రం మాత్రం అద్భుతంగా పురోగమిస్తోంది.
ఉద్యోగులకు సంబంధించి చిన్నాచితక సమస్యలు వస్తాయి. అవి కామన్. 69లో జరిగింది ముల్కీ రూల్స్ పోరాటమే. కేంద్ర ప్రభుత్వం ఏడిపించినా.. 95 శాతం రిజర్వేషన్లు లోకల్స్ కోసమే కేంద్రం నుంచి కొట్లాడి తీసుకొచ్చా. 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే. గెజిటల్ పోస్టులు కూడా మల్టీ జోనల్ పోస్టులుగా తీసుకొచ్చాం. అవి కూడా 95 శాతం తెలంగాణ బిడ్డలకే వస్తాయి. ఇవి తెలియక కొందరు పిచ్చిగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. ఉద్యోగుల సర్వీస్ రూల్స్ మారాలి. ఉద్యోగ సంఘాల నాయకులను కోరేది కూడా అదే. సర్వీస్ నిబంధనలు సరళీకరించాలి. రిటైర్ అయ్యేనాటికి సర్వీస్ రూల్స్ సులభంగా ఉండాలి.. అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.