దేశంలో అత్యధికంగా పని కల్పిస్తున్న రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం 13 కోట్లు కాగా 2021-22లో 14.40 కోట్ల పనిదినాలను ఉపాధి హామీ కూలీలకు కల్పించారు. మొత్తం రూ.4,080 కోట్లు ఖర్చు చేశారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణ రెండుసార్లు అత్యధిక పనిదినాలను కల్పించింది. 2019-20లో 15.79 కోట్ల పనిదినాలను కల్పించారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో శాశ్వత మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఉపాధి హామీ పనులను వినియోగిస్తున్నారు.
ప్రతి గ్రామానికి ఒక నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ షెడ్డు, సీసీ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా, గ్రామాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పనిదినాలను కల్పించిన జిల్లాగా నల్లగొండ తొలిస్థానంలో ఉన్నది. ఈ జిల్లాలో 95.16 లక్షల పనిదినాలను కూలీలకు కల్పించారు. కామారెడ్డి జిల్లాలో 93.18 లక్షలు, సూర్యాపేట జిల్లాలో 74.45 లక్షలు, వికారాబాద్ జిల్లాలో 72.16 లక్షలు, పట్టణ ప్రాంతం ఎక్కువగా ఉండే మేడ్చల్ జిల్లాలో 1.92 లక్షల పనిదినాలను కూలీలు పొందారు.
ఒక్కో కూలీకి సగటున రోజుకు రూ.172 చొప్పున చెల్లించారు. జాబ్ కార్డు ఉన్న కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి సగటున 49 రోజుల పని కల్పించారు. ఉపాధి హామీ పని చేస్తున్న వారిలో 58 శాతం మహిళలే ఉన్నారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. సామాజిక వర్గాల వారీగా చూస్తే ఎస్సీలు 22 శాతం, ఎస్టీలు 21 శాతం పనులకు హాజరయ్యారు. 3.26 లక్షల కుటుంబాలు 100 రోజులు పనిచేశారు.