మనమంతా ఒకటే కుటుంబమని.. నేతలంతా విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ నిర్దేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్ కోఆర్డినేటర్లతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ వారికి దిశానిర్దేశం చేశారు.
యుద్ధం చంద్రబాబుతో కాదని.. ఎల్లో మీడియాతో అని సీఎం పునరుద్ఘాటించారు. ఎల్లో మీడియా తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకు వాస్తవాలను వివరించాలని సూచించారు. ఈక్రమంలో సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకోవాలని చెప్పారు. జులై 8న ప్లీనరీ నిర్వహిస్తామని జగన్ తెలిపారు. ఈలోపు జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలని.. ఆయా కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు 50శాతం చోటు కల్పించాలని ఆదేశించారు.
జిల్లా అధ్యక్షులను జిల్లా అభివృద్ధి మండలి ఛైర్మన్లుగా చేసి వారికి కేబినెట్ హోదా ఇస్తామన్నారు. మే నెల నుంచి పూర్తిగా గేర్ మారుస్తున్నామని.. అందరూ సిద్ధంగా ఉండాలని జగన్ స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధి మండలి ఛైర్మన్ల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.