Home / EDITORIAL / దేశవాసులంతా కేసీఆర్‌కు అండగా నిలవాలి

దేశవాసులంతా కేసీఆర్‌కు అండగా నిలవాలి

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన మాటలు నేను ఇందాకా టీవీలో విన్నాను. ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా! అహంకారంతోనో లేదా తన సొంత కీర్తిని చాటుకుంటూనో కూడా ఆ ప్లీనరీలో మాట్లాడవచ్చు. నిజానికి చాలామంది రాజకీయనేతలు చేసేపని అదే కదా! అయితే కేసీఆర్‌ తద్విరుద్ధంగా.. ఆలోచనాత్మకంగానూ, ఒక పరిణతి చెందిన రాజకీయనేతగానూ, హుందాతనంతోనూ తన పార్టీ అధ్యక్షోపన్యాసం చేయడం నన్ను ఆకట్టుకుంది.

సాధారణంగా రాజకీయ నేతల మాటలు ఎప్పుడూ పరనిందలతోనూ, తిట్లతోనూ, స్వగుణగానంతోనూ నిండి ఉంటాయి తప్ప అంతగా నిర్మాణాత్మకంగా ఉండవు. అట్లా ఎందుకు ఉండవు అంటే వారి చూపు చాలాసార్లు చిన్నది గనక. విస్తృతమైన కార్యరంగంగా వారు తామున్న రాజకీయరంగాన్ని నిజంగా చూడరు. కేవలం పదవి లక్ష్యంగా మాత్రమే తరుచూ కాసిన్ని ఊకదంపుడు మాటలు మాట్లాడతారు గానీ చేయవలసిన పనులను గురించి, వాటిలోని మంచిచెడ్డల్ని గురించి విస్తృతంగా తమ ఆలోచనలని చెప్పరు. సరిగ్గా ఇందుకు భిన్నంగా సాగింది ఇవాళ్టి తెరాసా ప్లీనరీలోని చంద్రశేఖరరావు గారి అధ్యక్షోపన్యాసం. అందుకని నేను దాన్ని శ్రద్ధతో, ఆసక్తితో విన్నాను . నాకు ఆయన మాటలు నచ్చాయి కూడా! అవి సమంజసంగా కూడా అనిపించాయి .

తన రాష్ట్రంలో తాను సాధించిన అనేక రంగాలలోని మంచి మార్పుల గురించి చంద్రశేఖరరావు గారు తన మాటల్లో ప్రస్తావించారు. ఆయా సంగతులను ప్రస్తావిస్తూనే చంద్రశేఖరరావు గారు మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ దేశం తాలూకు కీర్తిప్రతిష్టలని దిగజార్చే ఇతర రాజకీయ పార్టీలలోని వ్యతిరేక రాజకీయ పంథా విషయంలో ఆయన ఒక ఆవేదనని కూడా వ్యక్తం చేశారు. ఆ రకమైన వేదన ఇవాళ ఈ దేశంలోని ప్రజాస్వామ్యవాదులమైన మా అందరిలోనూ ఉంది కూడా! శాంతి, సామరస్యం భారతదేశ సంప్రదాయానికి పెట్టని సొమ్ములు. మత విద్వేషాలు హిందువులకి సహజ నైజం కాదు. కానీ, హిందుత్వ అనే ఒక రాజకీయపు మాటని వాడి ఇవాళ ఈ దేశంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలు ఏవైతే ఉన్నవో… దానికీ హిందూ మతానికీ నిజానికి ఎలాంటి సంబంధమూ లేదు .

మత రాజకీయాలు ఈ దేశ ప్రగతికి దోహదపడేవి కావెన్నడూ! సహజ వనరులు సమృద్ధిగా ఉన్న భారతదేశంలో ఇవాళ రాజకీయ పార్టీలు ప్రగతి వైపు ఆలోచనలు చేయకుండా… తమతమ సొంత ఎజెండా కోసం అని ఈ దేశ అభ్యుదయానికి సర్వత్రా తూట్లు పొడిచే రాజకీయ పంథాలోకి ఈ దేశాన్ని మళ్లించాలి అని ఒక కుటిల ప్రయత్నం చేయడాన్ని చంద్రశేఖరరావు గారు సూటిగానే విమర్శించారు. అయితే ఆ విమర్శని కూడా ఆయన సహృదయంతో చేశారు. సున్నితంగా చేశారు. అది నాకు నచ్చింది. వూరికే ఒకరినొకరు తిట్లు తిట్టుకోవడమే తప్ప నిర్మాణాత్మకమైన విమర్శకి చెవులు బిగించుకుని కూచున్న రాజకీయరంగంలో కేసీఆర్‌ గారు చేసిన విమర్శ నిర్మాణాత్మకంగా ఉండటం నాకు చాలా రిలీఫ్‌నిచ్చిన విషయం .

రాజకీయనాయకులు శుభ్రమైన భాషని వాడటం పూర్తిగా మరిచిపోతూ ఉన్న ఇవాళ్టి రోజున.. తన మనుష్యుల మధ్యనే కూచుని కూడా చంద్రశేఖరరావుగారు చక్కటి తెనుగు మాటల్లో హుందాగా తన అభిప్రాయాలు వ్యక్తీకరించారు. అది కూడా నా చెవులకి ఇంపుని కలిగించింది. చాలా రోజులకి చక్కటి తెనుగు వాక్యాలని విన్నాను అని అనుకున్నాను నేను చంద్రశేఖర రావు గారి మాటల్ని వింటూ !

ఆయన చేసిన పనులని ప్రస్తావిస్తూనే కేసీఆర్‌ అన్న మాటలు ఇవీ! ఈ దేశంలో ఒక రాష్ర్టాధినేతగా నేను ఈ ఈ పనులని చేయగలిగినప్పుడు ఆయా పనులని మీమీ రాష్ర్టాలలో మీరు ఎందుకు చేయలేరు? అని. అది నిజం కదా? మీ మీ రాష్ర్టాలలో మీరెందుకు చేయలేరు? ఆ ఘోరమైన తిట్లని కాసేపు ఆపి, మీ మీ పార్టీలలోని పరాజయాలని బేరీజు వేసుకుని మిగిలిన రాజకీయ నేతలు కూడా మంచి మార్పులకి కారణం ఎందుకు కాలేరూ? అనే ప్రజలు కూడా అనుకుంటూ ఉంటారు మరి .

ఒక నాయకుడికి ముందుచూపు ఉండాలి. తాను ఎన్నుకున్న రంగం ద్వారా తానూ తన రాష్ట్ర ప్రజలకు ఏమేమి చేయాలని అనుకుంటే గనక, అందుకు ఆయనకి ముందుగా ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికని అమలు పరచడానికి తగిన క్రమశిక్షణ సైతం ఆ నాయకునికి, ఆ పార్టీకీ తప్పక ఉండాలి. వాటిని అమలు చేసేలా చూడగల పరిపక్వత, నిబద్ధత, అలాగే అందుకు అవసరమైన వనరుల వినియోగం… ఇది కూడా స్పష్టంగానే ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ నాయకుడు తన రాష్ర్టాన్ని ముందుకు నడిపించగలుగుతాడు. ఆ రాష్ట్ర ప్రజలకి సదుపాయాలని చేయగలుగుతాడు.

తెలంగాణలో విద్యుత్‌ రంగంలో తాము సాధించిన అభివృద్ధిని గురించీ … ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా తెలంగాణాలో తాగునీరు, సాగునీరు సమస్యలని ఎట్లా తాము పరిష్కరించుకున్నదీ, తద్వారా పంటలతో తమ రాష్ర్టాన్ని ఎట్లా సస్యశ్యామలం చేసుకోగలిగినదీ, ప్రస్తావన చేస్తూనే మరికొన్ని మాటలు కూడా కేసీఆర్‌ అన్నారు. చాలా చేయగల అవకాశాలు ఉండి కూడా సరైన చూపు లేక దేశ ప్రగతిని గనక దృశ్యమానం చేసుకోలేక పొతే& ఒక దేశం క్రమంగా వెనకబడిపోవడం కూడా ఎట్లా జరగగలదో వివరించి చెప్పారాయన .

జీవనదులు కలిగిన ఈ సువిశాల భారత దేశం విద్యుచ్ఛక్తి విషయంలో గాని, నీటి తగాదాల విషవలయంలో గాని చిక్కుకుని పోవడం ఎప్పుడైనా అన్ని రాజకీయ పార్టీలకి కూడా సిగ్గుపడాల్సిన విషయం అన్నారు కేసీఆర్‌. తన రాష్ట్రంలో తాను ఈ సమస్యలని నెమ్మదిగా అధిగమించగలిగినప్పుడు మిగిలిన రాష్ర్టాలు సైతం ఈ పనులు ఎందుకు చేయలేవు? అన్నది ఆయన వేసిన ప్రశ్న. అది సముచితమైన ప్రశ్నగా నేను భావించాను. ఈ ప్రశ్ననే రేపు మిగిలిన రాష్ర్టాల ప్రజలు కూడా తమ నాయకులని అడగాలి అని నేను కోరుకుంటాను కూడా !

దేశ ప్రగతి కోసం రాజకీయ రంగం ద్వారా ఒక నాయకుడు తన కార్యరంగాన్ని మరింతగా విస్తృత పరుచుకోవాలి అని గనక ఆలోచిస్తే అది ఆహ్వానించదగిన పరిణామమే! తెలంగాణా రాష్ట్రంలో తాను సాధించిన పురోగతిని భారతదేశంలో కూడా తాను సాధించగలను అన్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావుగారి దృక్పథం! అది సదుద్దేశం అయినప్పుడు ఎవరికైనా ఆయన ఆశయం పట్ల ప్రతికూలత మాత్రం ఎందుకుండాలి?

ఈ దేశంలో ఇవాళ్టి దాకా పాలన చేసిన పార్టీలు తమ వైఫల్యాలని బేరీజు వేసుకోవడంలో కూడా విఫలం చెందడం చాలా విచారకరం! మత విద్వేషాలు అన్న రాజకీయ ఎజెండాతో బీజేపీ దేశ జనులని విభజించి రాజకీయాలు చేయాలి అని అనుకోవడం ఈ దేశానికి మంచిది కాదని చంద్రశేఖరరావుగారు అన్నారు. ఒక ప్రజాస్వామికవాదిగా నేను ఆయన మాటలతో సంపూర్తిగా ఏకీభవిస్తున్నాను. మతపరమైన రాజకీయాలు ఎప్పుడూ మంచి మార్పులని తీసుకుని రాలేవు. ఆ రాజకీయ దృక్పథమే సంకుచితత్వం. దాన్ని అధిగమించి చూడటం అందులో కూరుకుని పోయినవారికి ఎంతో కష్టమైన పని.

విధ్వంసం చేయడం చాలా తేలిక. కానీ నిర్మించడానికి ఎప్పుడైనా ఎంత శ్రమపడాలి? అన్నారు కేసీఆర్‌. నిజమే కదా? విలువల విధ్వంసం విపరీతంగా జరుగుతున్న తరుణం ఇది ఈ దేశంలో ఇవాళ్టి కాలాన! అదుపు లేదు ఎక్కడా! ఇది తప్పనిసరిగా ఎక్కడో అక్కడ ఆగాలి. ఇందుకు ఒక మంచి నాయకుడు ఈ దేశానికి ఎంతో అవసరం! విజ్ఞత ఉన్న వ్యక్తీ… రాజకీయ పరిణితి కలిగిన వ్యక్తీ… ముందుచూపు ఉన్న వ్యక్తీ … పాలనా పగ్గాలు చేపట్టడం ఎప్పుడైనా వాంఛనీయమైన విషయమే అవుతుంది! వారు ఎవరన్నా కానివ్వండి. అలాంటివారికి స్వాగతం చెప్పాలి .

పక్క రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్‌ని చూస్తున్నాను. అక్కడ ఉన్నవాళ్ళ ప్రవర్తనని చూస్తున్నాను. ఒక రాష్ట్రం నెమ్మదిగా వెనకబడుతున్న దృశ్యాన్ని కూడా చూస్తున్నాను. కర్ణాటక రాష్ట్రంలో అనవసరమైన విషయాలతో అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఆ రాష్ర్టాన్ని పక్కదారి పట్టించడమూ నేను చూస్తున్నాను. ఇంకా ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ర్టాలలో జరిగే పాలన తీరుతెన్నులని చూస్తున్నాను. ఇలాగే గనక ఉంటే భారతదేశపు గమనం మందగించదా? తమతమ కయ్యాలతో దేశంలో పార్టీల అడుగులు వెనకబడవా? సామరస్య ధోరణి , సమైక్యతా భావం భారతదేశపు పయనానికి మంచితోవలు కావా? మన అడుగులకి మన పార్టీల మత వైఖరులు గనక అడ్డుపడితే.. ఇంక ముందుకి నడక ఏమి నడుస్తాము? అయితే ఆ సంగతిని ఈ దేశప్రజల ముందు ప్రస్తావన చే యగలిగిన నేతల అవసరం ఇ ప్పుడు ఈ దేశానికి ఉన్నది కదా? అందుకూ నేను కేసీఆర్‌ గారి మాటలని నచ్చుకున్నాను.

చంద్రశేఖరరావుగారి రాజకీయ ప్రత్యర్థులు కేసీఆర్‌ మాటలని గురించి, ఆయన రాజకీయపు నిర్ణయాన్ని గురించి ఏమని అంటా రు? అన్నది నాకు ముఖ్యం కాదు. ప్రజలకి మేలు చేస్తాను అన్న నిజాయితీని గనక ఒక నాయకుడు తన చేతలలో నిజంగా చూపిస్తే ఆ నాయకుని వెన్నంటి నమ్మకంతో ప్రజలు తప్పక ఉంటారు అనే నేను నమ్ముతాను .

అహంకారి కాని నాయకుడు మాత్రమే తన చుట్టూ ఉన్న ప్రజల అవసరాలని గమనించగలడు. దయ, అలాగే దార్శనికత కలిగిన ఒక నాయకుని అవసరం ఈ తరుణంలో ఈ దేశానికి ఎంతో అవసరం. మోదీలో మొదటినించీ కూడా ఈ రెండు లక్షణాలూ కొరవడ్డాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీ తన రాజకీయ విబేధాలలో సదా మునిగితేలుతూ ఉన్నది. ఆ పార్టీ తన వైఫల్యాల నించీ ఏమీ నేర్చుకున్నట్టు
కనబడదు. ఇంక మిగిలిన పార్టీల ప్రస్థానం కూడా ముఖ్యమే! చూడాలి, ఏ పార్టీ, నిజంగా ప్రజల ప్రయోజనాలని ప్రజల అవసరాలని నిజాయితీగా పట్టించుకుంటుందో?

విద్య, వైద్యం, పరిశ్రమలు, రైతు సంక్షేమం అన్నవి భారతదేశ ప్రగతికి తోడ్పడే విషయాలు. వీటిని ఎవరు సరిదిద్ది, చక్క చేయగలిగితే వారిని జనం నమ్ముతా రు. ఈ పనులు తాను చేస్తాను అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిలబడి సిద్ధపడితే ఎవరికైనా ఈ దేశంలో అభ్యంతరం ఎందుకుండాలీ?! అలాగే, ఆరోగ్యకరమైన పోటీ ఒకటి మన దేశంలోని రాజకీయరంగంలో ఏర్పడాలి కూడా. నిర్మాణాత్మకమైన పనులు చేయగల నాయకులు ఈ దేశంలో రావాలి . తెలంగా ణా తన కార్యరంగంగా కేసీఆర్‌ పనిచేసి, మాట్లాడుతున్నారు. తాను చేసిన మంచి పనులని ఈ దేశవ్యాప్తం గా కూడా అమలు చేయవచ్చును అని ఆయన భావిస్తున్నారు. అందుకు ఆయనకు తగిన సహకారం దేశవ్యాప్తంగా తప్పక లభించాలి అని నేను ఆశిస్తాను. తెలుగువారి అందరి సహకారం ఈ సందర్భంగా చంద్రశేఖరరావు గారికి లభించాలి.

– జయప్రభ
(జయప్రభ ప్రముఖ తెలుగు కవయిత్రి, సాహిత్య విమర్శకురాలు. ఆమె కవితలను మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వయంగా అనువదించారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం విన్న వెంటనే ఉత్సాహంగా స్పందించి తన ఆలోచనలకు ఇలా అక్షర రూపం ఇచ్చారు.)

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri