కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వచ్చిన సందర్భంగా శంషాబాద్‌లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు ప్రవర్తించిన తీరుపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
అడ్డుకోవడమే పని అయితే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలో తిరగలేడని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కూడా చేయలేడని వ్యాఖ్యానించారు. బండి సంజయ్‌ది పాదయాత్ర కాదని.. పాపాలను కడుక్కునే యాత్ర అని సుమన్ విమర్శించారు.
అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని చెప్పారు. ప్రధాని మోదీ అసమర్థతతోనే దేశంలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని బాల్క సుమన్ ఆరోపించారు. ఓయూకు వచ్చే ముందు తెలంగాణ ప్రజలకు రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.