రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్లాంట్లలో అదనంగా కెపాసిటీని జోడించాలని.. తద్వారా విద్యుత్ కొరతను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ బి.శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కృష్ణపట్నం, వీటీపీఎస్ ప్లాంట్లలో 800 మెగావాట్ల చొప్పున అదనపు యూనిట్లను త్వరగా ప్రారంభించాలని సూచించారు.
గృహవినియోగదారులకు పవర్‌కట్‌తో ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. వారంలో రెండురోజుల పాటు పరిశ్రమలకు పవర్ హాలిడేను కొనసాగిస్తున్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు. ఉచిత విద్యుత్ నగదును నేరుగా రైతుల ఖాతాల్లో వేయాలని.. వాళ్లే కరెంట్ బిల్లులు చెల్లిస్తారని జగన్ చెప్పారు.