తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీయం కేసీఆర్ నేతృత్వంలొ తెలంగాణ రూపురేఖలు మారిపోయాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ద్విచక్ర వాహనంపై మున్సిపాటిలోని రాంబాగ్, నాయుడి వాడలో పర్యటించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులు, గత పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల పరిష్కారం, పురోగతిపై గురించి ఆరా తీశారు. అభివృద్ధి పనులతోపాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ…. కొత్త జిల్లాలు ఏర్పడటంతో పాటు జిల్లా కోర్టులను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
అభివృద్దితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయని, వాటిని సకాలంలో అర్హులైన వారందరికీ అందేలా చూసే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. పల్లె, పట్టణాల్లో ఎన్నో అభివృద్ది పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతిలో అందరూ పాల్గొని తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని సీజనల్ వ్యాధుల భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రకృతి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని, కొన్ని వార్డుల్లో అనుకున్న స్థాయిలో పనులు జరగడం లేదని, అధికారులు అలసత్వం వీడాలన్నారు.