Home / EDITORIAL / దేశం పిలుస్తోంది-EDITORIAL.

దేశం పిలుస్తోంది-EDITORIAL.

దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్రమైన శూన్యత నెలకొని ఉన్నది. సమర్థమైన నాయకత్వ శూన్యత స్పష్టంగా ఉన్నదన్నది నిపుణుల మాట. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వామపక్ష భావజాలం జాతీయస్థాయిలో ప్రభావవంతంగా లేదు. అటు కీలకమైన కాంగ్రెస్‌ పార్టీ దీటుగా స్పందించే స్థితిలో లేదు. సోషలిస్టుల ప్రాభవం పూర్తిగా కనుమరుగైంది. ములాయం, లాలూ, శరద్‌యాదవ్‌ వంటి దిగ్గజాల వారసులు తమ తమ ప్రాంతాలను దాటి జాతీయ స్థాయికి ఇంకా అడుగులు వేయడం లేదు. జనతా పరివారం చీలికలు పేలికలైంది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సరైన ప్రత్యామ్నాయమే లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.

జాతీయ మీడియా సైతం ఇప్పుడు ఈ అంశంపై దృష్టి సారించింది. బలమైన పార్టీ లేక, బలమైన నాయకుడు కానరాక బీజేపీ ఆడింది ఆటగా సాగుతున్నదని వారంటున్నారు. సాధారణంగా జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీలు చాలా బలంగా ఉన్నట్టు కనిపిస్తుంటాయి. నిరంతర పొగడ్తల మేనియాలో నాయకులు అజేయంగా అనిపిస్తారు. కానీ అది నిజం కాదని స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన అనేక పరిణామాలు మనకు తార్కాణంగా కనిపిస్తాయి. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ లాంటి వారు సైతం అప్పటికప్పుడు ఉద్భవించిన పార్టీలు, కూటములతో కుప్పకూలారు.

ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బలంగా కనిపిస్తున్నది. కానీ, నిఖార్సైన నాయకుడు సరైన ఎజెండాతో దీటైన ప్రత్యామ్నాయం తీసుకొస్తే ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ స్థాయిలో దీటుగా నిలబడగలిగే పార్టీ లేకపోవటం వల్లే బీజేపీ బలంగా కనిపిస్తున్నది తప్ప.. ఆ పార్టీ తాననుకొంటున్నట్టుగా ప్రజాదరణ లేదని అంటున్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బీజేపీ.. విద్వేష ఎజెండాతో నాశనం చేస్తుండటాన్ని చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండాను చూపగలిగే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.

ఫ్రంట్లు కాదు.. ప్రత్యామ్నాయం కావాలి

దేశానికి ఇప్పుడు కావాల్సింది బలమైన జాతీయ పార్టీ తప్ప కూటములు కాదన్నది రాజకీయ విశ్లేషకుల కచ్చితమైన అభిప్రాయం. జనతాపార్టీ నుంచి ఆ తరువాత అనేక సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ.. అప్పటి రాజకీయ వాతావరణంలో పూర్తిగా సఫలం కాలేకపోయాయి. 1977లో మొరార్జీ దేశాయ్‌ రెండేండ్లకు మించి అధికారంలో లేరు. చరణ్‌సింగ్‌ నెలరోజుల్లోనే గద్దె దిగాల్సి వచ్చింది. ఆ తరువాత ఇందిర మళ్లీ అధికారం చేపట్టినా.. నాలుగేండ్లకు ఆమె హత్యకు గురికావడంతో తనయుడు రాజీవ్‌ అధికారంలోకి వచ్చారు. 1989లో నేషనల్‌ ఫ్రంట్‌ ఆయన్ను ఇంటికి పంపించింది.

కానీ ఆ తరువాత 2014 వరకు సంకీర్ణ ప్రభుత్వాలే కొనసాగాయి. ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్న గ్రూపులు అధికారంలో వాటా కోసం ఒక్క దగ్గరికి చేరుతాయి కాబట్టి నిలబడలేదు. వాటికి స్థిరమైన ఉమ్మడి ఎజెండా ఉండదు. అలాంటి ఫ్రంట్‌లు ప్రజల విశ్వసనీయతను కోల్పోయాయి’ అని సీనియర్‌ రాజకీయ విశ్లేషకుడు అన్నారు. ఇప్పుడు కూడా కొందరు ప్రాంతీయ నేతలు తమ కాంగ్రెస్‌ లాంటి పార్టీలతో పొత్తుల కోసం ఆలోచిస్తున్నారే తప్ప జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం గురించిన యోచన చేయడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో ఉన్న నాయకత్వ లోపానికి, ఎజెండాకు ప్రత్యామ్నాయం కావాలని స్పష్టం చేశారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న పార్టీలను నమ్ముకోవడం కన్నా, బలమైన, నిఖార్సైన, ప్రజామోదం ఉన్న వ్యక్తులను నమ్ముకోవటం ముఖ్యమని పేర్కొన్నారు.

కేసీఆర్‌.. అసలైన ప్రత్యామ్నాయం

ప్రజల నమ్మకాన్ని ఫ్రంట్‌లు నిలబెట్టలేవని, మరో జాతీయ పార్టీయే సరైన ప్రత్యామ్నాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు సీఎం కేసీఆరే అర్హుడని స్పష్టం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి వారే సీఎం కేసీఆర్‌ను చూసి భయపడుతున్నారని గుర్తు చేస్తున్నారు. మోదీ లేదా బీజేపీ బలంగా ఉంటే ఎందుకు కేసీఆర్‌ను చూసి భయపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ప్రధాని మోదీ రెండుసార్లు తెలంగాణలో పర్యటించారని, జేపీ నడ్డా, అమిత్‌ షా.. వరుసపెట్టి తెలంగాణకు వచ్చారని గుర్తుచేశారు.

కేంద్ర మంత్రుల పర్యటనలకు లేక్కేలేదని వెల్లడించారు. ఆ పార్టీ అగ్రనాయకులంతా తెలంగాణకు వచ్చి నేరుగా సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేస్తున్నారంటేనే ఆయన్ను తమ గట్టి ప్రత్యర్థిగా, సమవుజ్జీగా అంగీకరించినట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను సైతం హైదరాబాద్‌లో నిర్వహించడం, మరో రెండేండ్ల వరకు ఎన్నికలు లేకున్నా వారు తెలంగాణపై ఫోకస్‌ పెట్టడాన్ని బట్టి సీఎం కేసీఆర్‌ను చూసి వారు భయపడుతున్నట్టేనని అంటున్నారు.

అయ్యేదా.. పొయ్యేదా అనుకోవద్దు

సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ ఏ పని తలపెట్టినా.. అవతలి వ్యక్తుల అపనమ్మకం సహజమని, చివరికి ఆయన విజయం సాధించటం కూడా అంతే సహజమని విశ్లేషకులు చెప్తున్నారు. ఆయన 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనను తలకెత్తుకున్ననాడు ఇలాగే అన్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రకటించినప్పుడు, మిషన్‌ భగీరథ నీళ్లు ఇయ్యకుంటే ఓట్లు అడగనని శపథం చేసినప్పుడు ఇలాంటి అపశకునపు మాటలే వినిపించాయని అన్నా రు. రైతుబంధు ప్రకటించగానే ‘ఎన్నేండ్లు అమలు చేస్తరో చూస్తం’ అన్న వెకిలిమాటలూ విన్నామన్నారు.

సచివాలయం కడుతామన్నప్పుడు సైతం అడ్డగోలుగా మాట్లాడారని గుర్తు చేశారు. ఇవన్నీ సీఎం కేసీఆర్‌ సాధించి చూపించారని కుండబద్దలు కొట్టారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన్నాడు ఒక్క అనుకూల అంశం కూడా లేదని, ఇప్పుడు జాతీయ పార్టీ ఏర్పాటుకు అనేక సానుకూల అంశాలు ఉన్నాయని రాజకీయ పండితులు చెప్తున్నారు. బీజేపీ ప్రజాదరణ కోల్పోయిందని, శివసేన, అకాళీదళ్‌, పీడీపీ వంటి పార్టీలు కూటమి నుంచి బయటికి వచ్చేశాయని, బయటి నుంచి మద్దతిచ్చే పార్టీలు దూరమయ్యాయని చెప్తున్నారు.

మరోవైపు సూడో హిందుత్వంతో సోషల్‌ మీడియాలో చేస్తున్న ప్రచారంతో ఆకర్షితులు అవుతున్నవారి కంటే, ఈ మత విద్వేషాలను ఇలాగే రెచ్చగొడితే దేశం ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నవారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌, శ్రీలంక పరిస్థితి మనకు రాకుండా ఉంటే బాగుంటది అని అందరూ అనుకుంటున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ సూచిస్తున్న ప్రత్యామ్నాయ ఎజెండా దేశం ముందుకు వెళ్తే.. దానికదే అనుకూల వాతావరణ కల్పన జరుగుతుందని చెప్పారు. మోదీ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ అనివార్యంగా కలిసివస్తాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా తమ తమ రాష్ర్టాల్లో బలంగా ఉన్న నేతలు సైతం సీఎం కేసీఆర్‌తో కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. చివరగా.. ‘నిశీధిలో నడక మొదలుపెట్టి గమ్యాన్ని ముద్దాడినవాడికి కాంతి పుంజం ఆసరా దొరికితే విజయం సాధించటం కష్టమా!’అని వ్యాఖ్యానించారు.

బీజేపీని వ్యతిరేకిస్తున్నవారే ఎక్కువ..

బీజేపీ వరుసగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించింది. మొదటిసారికంటే రెండోసారి బీజేపీ లేదా ఎన్డీయే కావాలనుకొనేవారి కంటే వ్యతిరేకించినవారే ఎక్కువ. రెండు ఎన్నికల్లోనూ బీజేపీ కనీసం నలభై శాతం ఓట్లను కూడా సాధించలేకపోయింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి 31 శాతం మంది ఓటేస్తే.. వద్దని 69 శాతం మంది నిర్మొహమాటంగా చెప్పారు. 2019లోనూ పరిస్థితి పెద్దగా మారలేదు.

వందకు 62 మంది బీజేపీని వద్దనుకున్నవారే ఉన్నారు. ఎన్డీయేను సైతం 2014లో 61.5 శాతం మంది, 2019లో 54 శాతం మంది వ్యతిరేకించారని చెప్పారు. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఎన్డీయే నామమాత్రమైందనే చెప్పాలి. బీహార్‌లో జేడీయూ తప్ప దశాబ్దాల తరబడి వెంట ఉన్న శివసేన, అకాలీదళ్‌ వంటి పార్టీలు కూడా బీజేపీని వదిలేశాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఇతర పార్టీ అనుకూల ఓట్లు మరింత దూరం కావడం ఖాయంగా కనిపిస్తున్నది.

కేసీఆర్‌ వైపు జాతీయ మీడియా చూపు

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై జాతీయ మీడియా ఫోకస్‌ పెట్టింది. ఆయన కార్యకలాపాలు, సమావేశాలపై అమితాసక్తిని ప్రదర్శిస్తున్నాయి. అందుకు శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్‌ ఇష్టాగోష్ఠిపై అర్ధరాత్రి వరకు ఉత్కంఠగా ఎదురుచూసిన సందర్భమే ఉదాహరణ. రాజకీయ సన్నిహితులకు ఫోన్లు చేస్తూ సమావేశ అంశాలపై ఆరా తీశాయి. ఈ సమావేశంపై ప్రధాన జాతీయ మీడియా సంస్థలు శనివారం ప్రత్యేక కథనాలను ప్రముఖంగా ప్రచురించాయి.

జాతీయ ఎలక్ట్రానిక్‌ మీడియాలోనూ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక సమావేశం, అందులో చర్చించిన అంశాలు, జాతీయ పార్టీని ఏర్పాటు చేయటంపై శుక్రవారం రాత్రి నుంచే టెలికాస్ట్‌ చేశాయి. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొన్నట్టు వెల్లడించాయి. ‘నవ భారత్‌ పార్టీ’ని స్థాపించి జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ అడుగుపెట్టనున్నారని ‘ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ కథనాన్ని రాసింది.

టీఆర్‌ఎస్‌ను భారతీయ రాష్ట్ర సమితిగా మార్చాలని కేసీఆర్‌ నిర్ణయించారని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వార్తను ప్రచురించింది. డెక్కన్‌ క్రానికల్‌, ఇండియన్‌ హెరాల్డ్‌, ది ట్రిబ్యున్‌, ది హిందూ, జాగరణ్‌ తదితర ప్రముఖ జాతీయ మీడియా సంస్థలన్నీ ఇంచుమించు అవే కథనాలను ప్రచురించాయి. అదీగాక కేసీఆర్‌ తన కొత్త పార్టీని జూన్‌ 19న అధికారికంగా ప్రకటిస్తారని, అకడే జాతీయ ఎజెండా అంశాలను, పార్టీ ప్రణాళికలను వెల్లడిస్తారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

అక్కడితో ఆగకుండా టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సాధారణంగా దసరా సందర్భంగా ఏదైనా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని, అందులో భాగంగా ఈ సారి జాతీయ పార్టీని ప్రారంభించనున్నదని కథనాలు రాశాయి. పత్రికల్లో వచ్చిన కథనాలపై సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్నది. టీఆర్‌ఎస్‌ ఇక బీఆర్‌ఎస్‌.. ప్రత్యామ్నాయం రావాల్సిందే అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

కేసీఆర్‌ ఎందుకు ప్రత్యామ్నాయమంటే..

దేశంలో రాజకీయ శూన్యతను సీఎం కేసీఆరే పూడ్చగలరని చెప్పడానికి కొన్ని అంశాలను రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు.

  • విషయ పరిజ్ఞానం: సీఎం కేసీఆర్‌కు దేశంలోని అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఉన్నది. హిందీ, ఇంగ్లిష్‌ అనర్గళంగా మాట్లాడగలరు. అపార రాజకీయ అనుభవం, విజ్ఞానం ఆయన సొంతం.
  • అసలైన హిందుత్వ ప్రతినిధి: బీజేపీ ప్రచారం చేసుకొంటున్న పొలిటికల్‌ హిందుత్వ భావజాలాన్ని తిప్పికొట్టగలిగేలా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మీద సీఎం కేసీఆర్‌కు సమగ్ర అవగాహన ఉన్నది. ఆయన పక్కా హిందుత్వ సిద్ధాంతాలను పాటించే వ్యక్తి. అయినా అన్ని మతాల వారిని ఆదరిస్తారు, అన్ని మతాల వారు ఆయనను అంగీకరిస్తున్నారు.
  • దేశంపై అవగాహన: ప్రస్తుతం దేశం అవసరాలు, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉన్నది. వాటి పరిష్కారాలపై స్పష్టత ఉన్నది. అనేక సందర్భాల్లో తన అభిప్రాయాలను తెలియజేశారు కూడా.
  • తెలంగాణ మాడల్‌: ఎనిమిదేండ్లలోనే కొత్త రాష్ట్రమైన తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు. అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించారు. దేశానికి తెలంగాణ మాడల్‌ను పరిచయం చేశారు. ఇప్పుడు దేశానికి తెలంగాణ మాడల్‌ అవసరం ఉన్నది.
  • మోదీకి దీటుగా..: మోదీకి దీటుగా, కేంద్ర వైఫల్యాలను ధైర్యంగా ఎండగడుతున్నది సీఎం కేసీఆర్‌ మాత్రమే. ‘మోదీ ప్రభుత్వం వల్ల దేశానికి కలుగుతున్న నష్టాలను టీఆర్‌ఎస్‌ మాత్రమే ప్రస్తావిస్తున్నది. కేంద్రాన్ని దీటుగా ఎదుర్కోవటంలో మిగతా విపక్షాలు విఫలమయ్యాయి’అని ప్రముఖ వెబ్‌సైట్‌ వైర్‌ స్పష్టం చేసింది. మోదీకి కేసీఆర్‌ ప్రత్యామ్నాయం అనటానికి ఇది ఒక సూచిక అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Source : NT

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat