తెలంగాణలో సర్కారు స్కూళ్లను సమగ్రంగా మార్చే మన ఊరు – మనబడి కార్యక్రమ పనులు ఊపందుకొన్నాయి. మొదటి విడతలో చేపట్టిన బడుల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఒక్కో మండలాన్ని ఒక యూనిట్‌గా చేసుకొని పనులను ఇంజినీరింగ్ ఏజెన్సీలకు అప్పగించారు. మండలానికి రెండు చొప్పున మాడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రంలోని 594 మండలాల్లో 1,188 స్కూళ్లను జూన్ 30 నాటికి సిద్ధం చేయాలని గడువుగా విధించారు. మిగతా 7,935 బడుల్లోనూ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తొలి విడతకోసం ఎంపిక చేసిన 9,123 స్కూళ్లలో 5,399 ప్రాథమిక, 1,009 అప్పర్ ప్రైమరీ, 2,715 హైస్కూళ్లు ఉన్నాయి. పథకం కోసం ప్రభుత్వం రూ. 3497.54 కోట్లు ఖర్చుచేస్తున్నది.