గర్భిణీ తినాల్సిన పండ్లు ఏవి..?
rameshbabu
May 30, 2023
LIFE STYLE , SLIDER
2,540 Views
గర్భిణీ తన కడుపులో పిండం పెరుగుతున్న దశలో ఇద్దరికీ సరిపోయేలా తినమని పెద్దలు చెప్పే మాట ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ అది నిజమే. గర్భిణిగా ఉన్నప్పుడు చేసుకునే ఆహార ఎంపికలు కడుపులో బిడ్డమీద కూడా ప్రభావం చూపుతాయి. పిండం అభివృద్ధి కోసం తల్లి నాణ్యమైన పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పండ్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అన్ని పండ్లు మంచివే అయినా, గర్భిణులకు కొన్నింటిని మాత్రం తప్పకుండా తినాలని పెద్దలు సలహా ఇస్తారు.
పోషకాలతో నిండిన ఆపిల్ పండ్లు కడుపుతో ఉన్నవారికి ఎంతో మేలుచేస్తాయి. విటమిన్ -ఎ, సితోపాటు ఆపిల్ పండ్లు పొటాషియం, ఫైబర్‌కు మంచి వనరులు. గర్భిణిగా ఉన్నప్పుడు ఆపిల్ పండ్లు తినని మహిళలకు జన్మించిన పిల్లల్లో 5 సంవత్సరాల వయసులో ఆస్తమా లాంటి శ్వాస సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్టు తేలింది. ఆపిల్ పోషకాలలోని ఫ్లేవనాయిడ్లలో ఉండే పాలిఫినాలిక్ మిశ్రమాలు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవే ఆస్తమా ముప్పును తగ్గించడంలో సహాయకారిగా ఉంటాయి.
విటమిన్లు, మినరల్స్‌తో సమృద్ధమైన అరటిపండ్లు గర్భిణులు తప్పకుండా తినాల్సిన పండ్లు. గర్భిణులను వేధించే సమస్యల్లో సాధారణమైంది ఐరన్ లోపం. దీంతో రక్తహీనత తలెత్తకుండా శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయులు పెరగడానికి అరటిపండు దోహదపడుతుంది. గర్భధారణ సమయంలో తలెత్తే వాంతులు, వికారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అరటిపండ్లలో ఉండే ఫోలిక్ ఆమ్లం కడుపులో ఉన్న బిడ్డకు కూడా మంచిది. ఇది శిశువు ముందస్తు ప్రసవానికి గల అవకాశాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా గర్భిణిగా ఉన్నప్పుడు తిండి అంటే మొహం మొత్తుతుంది. అరటిపండు తినడం వల్ల ఆకలి పెరుగుతుంది.
దానిమ్మ పండ్లలో పాలిఫినాల్ స్థాయులు అత్యధికంగా ఉంటాయి. గర్భిణిగా ఉన్నప్పుడు దానిమ్మ పండ్లు తినడం వల్ల శిశువుల నాడుల సంరక్షణలో ఆ పాలిఫినాల్స్ సహాయకారిగా ఉంటాయి. అంతేకాకుండా దానిమ్మపండ్లు విటమిన్ కె, ఐరన్, ఫైబర్, ప్రొటీన్, క్యాల్షియం లాంటివాటికి పెద్ద నిధులు కూడా.
గర్భిణులు తీసుకునే పండ్లలో ముందువరసలో ఉండేవి నారింజ. వీటిని పండుగాను, లేదంటే రసం రూపంలోనూ తీసుకుంటారు. అయితే ప్రిజర్వేటివ్‌లు ఉండే టెట్రా ప్యాక్ జ్యూస్‌లను మాత్రం తీసుకోకపోవడమే మంచిది. నారింజను పండు రూపంలో తింటే దాని ప్రయోజనాలు పూర్తిగా చేకూరుతాయి. ఒకవేళ పండు ఇష్టం లేకపోతే, ఇంటి దగ్గరే తాజా పండ్ల రసం తాగాలి. నారింజ రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పైగా కడుపులో ఉన్న పిండం మెదడు అభివృద్ధిలో నారింజ దోహదపడుతుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.
చాలామంది గర్భిణులు మామిడికాయ, చింతకాయ అంటే ఉవ్విళ్లూరుతుంటారు. ఎ, సి విటమిన్లతో సమృద్ధమైన మామిడి పండ్లు కూడా కడుపుతో ఉన్నప్పుడు ఇష్టంగా తింటారు. సహజంగా మగ్గిన పండ్లయితే ఫర్వాలేదు, కానీ క్యాల్షియం కార్బయిడ్ వాడిన పండ్లతోనే సమస్య అంతా. కాబట్టి, గర్భిణులు మామిడి పండ్ల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.
Post Views: 2,634