నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) సభ్యులందరూ ముస్లిం మహిళలతో రాఖీలు కట్టించుకోవాలంటూ పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్రమోదీపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే (UBT) శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే తీవ్ర విమర్శలు గుప్పించారు. ముస్లింల విషయంలో బీజేపీది, ఆ పార్టీ నేతలది ఎప్పుడైనా ద్వంద్వ వైఖరేనని మండిపడ్డారు.
ఒక వైపు హిందూ, ముస్లింల మధ్య మతచిచ్చు రేపుతూనే మరోవైపు ముస్లింలపై ప్రేమ ఒలకబోయడం బీజేపీ నేతల కుటిల రాజకీయ నీతికి నిదర్శనమని ఉద్ధవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్డీఏ సభ్యులంతా ముస్లిం మహిళలతో రాఖీలు కట్టించుకోవాలని ప్రధాని పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్న ఉద్ధవ్.. మోదీకి దమ్ముంటే 2002 అల్లర్ల సందర్భంగా సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో చేత రాఖీ కట్టించుకోవాలని సవాల్ విసిరారు.