తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఇది…వలసలతో విలపించిన పాలమూరును పాలు పొంగే జీవగడ్డగ మారుస్తూ..తరతరాలుగా పట్టిపీడిస్తున్న కరువు కాటకాలను శాశ్వతంగా తరిమికొడుతూ.. కృష్ణా జలాలతో ఆరు జిల్లాలను సస్యశ్యామలంగా మారనున్న మహోజ్వల ఘట్టం ఇది. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా నార్లాపూర్ ఇంటెక్ వద్ద బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని రికార్డు స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖాధికారులు పోలీసు, రెవెన్యూ అధికారులు సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు. కొల్లాపూర్ పట్టణమంతా జెండాలు, ఫ్లెక్సీలతో గులాబీమయంగా మారింది. సీఎం కేసీఆర్ నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించనున్నారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జలహారతి పట్టనున్నారు. అనంతరం కొల్లాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాని (పీఆర్‌ఎల్‌ఐఎస్)కి రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించగా.. కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ఆయా ప్యాకేజీల పనులన్నీ దాదాపు తుదిదశకు చేరుకొన్నాయి. ఇక ప్రాజెక్టు ద్వారా నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,226 గ్రామాలకు తాగు, సాగునీరు అందనున్నది. ప్రాజెక్టు నీళ్లతో 1,546 నీటికుంటలు, చెరువులను నింపనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నీటి ఎత్తిపోతలను ప్రారంభించేందుకు అధికారయంత్రాంగం సన్నాహాలు చేసింది.