ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన కోనసాగిస్తున్నారని, ప్రజా, రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే మరోసారి బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని బంగల్‌పేట్ నుంచి మంత్రి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ..ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
వృద్ధులను, మహిళలను ఆప్యాయంగా పలుకరిస్తూ..అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు కేసీఆర్ మేనిఫెస్టోను వివరిస్తూ..మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఉన్న హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు.
కేసీఆర్ భరోసా పేరుతో ప్రవేశపెట్టి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఆలు లేదు చూలు లేదు..కొడుకు పేరు సొమలింగయ్య అన్నట్లు కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని ఎద్దేవా చేశారు. రైతుబంధు ఆపాలని కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్పాలన్నారు. రైతు వ్యతిరేఖ కాంగ్రెస్ పార్టీని అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మంత్రి బంగల్‌పేట్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.