నాడు సమైక్య పాలనలో కరెంటు లేక సాగు, తాగునీరు లేక, అభివృద్ధికాక అరిగోసలుపడ్డామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రస్తుతం పచ్చబడ్డ తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు కుట్రలు పన్నారని విమర్శించారు. కొత్తపల్లి మండలంలోని కమాన్‌పూర్, బడ్డిపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్‌ను బలపరచాలన్నారు.
తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ఓటువేసే ముందు సమైక్య పాలనలో జరిగిన అన్యాయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో పింఛను ఇవ్వలేదని.. కొత్తగా పింఛన్ కావాలంటే.. మరో లబ్ధిదారు చావుకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కానీ, స్వయం పాలనలో సమస్యలన్నీ పరిష్కారమై ఇప్పుడిప్పుడే ముఖాలు తెల్లబడుతున్నాయన్నారు. తెలంగాణ వ్యతిరేకులు ఇక్కడి సంపదను దోచుకొని.. తెలంగాణను గుడ్డి దీపం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ లేని తెలంగాణను ఊహించుకోలేమని.. ఆంధ్రోళ్ల మాటలు నమ్మి మోసపోతే మన నీళ్లు, నిధులు దోచుకుంటారని హెచ్చరించారు.
తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకుందామని ఢిల్లీ పాలకుల చేతుల్లో తెలంగాణను పెట్టొద్దని, వారి చేతుల్లోకి తెలంగాణ పోతే కుక్కలు చింపిన విస్తరిని చేస్తారన్నారు. కర్ణాటక ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌దని, వారి మాటలు నమ్మి మన పోరగాళ్ల నోట్లో మన్ను కొట్టొద్దని పిలుపునిచ్చారు. మళ్లీ ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికలప్పుడే కనిపించి ఆ తర్వాత కనిపించకుండా పోతారన్నారు. బీజేపీ కాంగ్రెస్‌లకు ఓటేస్తే ఆంధ్ర పెత్తనమే అని, ఆంధ్రోళ్ళు తెలంగాణను ఎత్తుకుపోదామని చూస్తున్నారన్నారు.