తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలతో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వైద్యశాలలో రూ. 3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అంందించే ఉద్దేశ్యంతో సీయం కేసీఆర్ డయాగ్నస్టిక్ హబ్ సెంటర్ ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
బడ్జెట్ కేటాయింపులకు అదనంగా రూ. 10 వేల కోట్లను వైద్య సేవలకు ముఖ్యమంత్రి కేటాయించారని వెల్లడించారు. ఇప్పటి వరకు కార్పోరేట్ హస్పిటల్స్ కే, ప్రభుత్వ పెద్దాసుపత్రులకు పరిమితమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇప్పుడు సామాన్యుల చెంతకు చేరాయన్నారు. డయాగ్నస్టిక్ సెంటర్ లో కరోనా పరీక్షలతో పాటుగా రక్త పరీక్ష, మూత్ర పరీక్ష సహా బీపీ షుగర్ తదితర 57 పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
సాధారణ పరీక్షలే కాకుండా, ఖర్చుతో కూడుకున్న ప్రత్యేక పరీక్షలను కూడా పూర్తిగా ఉచితంగా అందిస్తారన్నారు. వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగ నిర్ధారణ పరీక్షల సాంపిల్ ను సేకరించి పంపి జిల్లా కేంద్రంలో ఉన్న డయాగ్నస్టిక్ సెంటర్ కు పంపి పరీక్షలు సాయంత్రానికి కల్లా టెస్ట్ రిజల్ట్స్ నేరుగా మొబైల్ ఫోన్ కు సందేశం పంపుతారని వివరించారు. భవిష్యత్తులో నిర్మల్ జిల్లాలో మరిన్ని వైద్య సేవల, సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు.అనంతరం ఆసుపత్రిలో వైద్య సేవలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కొరిపల్లి విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీఎంహెచ్వో ధనరాజ్ సూపరింటెండెంట్ దేవెందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.