వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.ఈ అంశంపై పూర్తి తీర్పు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.అదే విధంగా రైతు ఆందోళనల నేపథ్యంలో సమస్య పరిష్కారానికై నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది.రైతుల ప్రతినిధులు, ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది.
భూపేందర్ సింగ్ మాన్(బీకేయూ), ప్రమోద్ కుమార్ జోషి(ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్), అశోక్ గులాటీ(వ్యవసాయ శాస్త్రవేత్త), అనిల్ ఘావంత్(షెట్కారీ సంఘటన)ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.కాగా కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న రైతులతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇరు వర్గాల మధ్య చర్చల ప్రక్రియ అత్యంత నిరుత్సాహపూరితంగా సాగుతోందని వ్యాఖ్యానించింది.అవసరమైతే ఈ చట్టాల అమలుపై స్టే విధిస్తామన్న న్యాయస్థానం..మంగళవారం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.అదే విధంగా కమిటీని నియమించే అధికారం తమకు ఉందని అభిప్రాయపడింది.ఈ సందర్భంగా.. ‘‘అందరి కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. మాకు నివేదిక సమర్పించేందుకే కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. రైతు సంఘాలు సహకరించాలి.
సమస్య పరిష్కారం కోసం ఇరుపక్షాలు కమిటీని సంప్రదించాలి. కమిటీని నియమించడంతో పాటుగా.. చట్టాలను నిలిపివేసే అధికారం కూడా మాకు ఉంది. అయితే ఇప్పుడు స్టే విధించామే తప్ప.. చట్టాలను నిరవధికంగా నిలిపివేయబోవటం లేదు. మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాం.ఒకవేళ రైతు సంఘాలు కమిటీకి సహకరించకపోతే.. ప్రధానిని ఏదైనా చెయ్యమని మేం అడగలేం కదా’’అని సర్వోన్నత న్యాయస్తానం పేర్కొంది.