రికార్డు స్థాయిలో వేలం జరిగే హైదరాబాద్‌లోని బాలాపూర్ గణపయ్య లడ్డూ తాపేశ్వరం నుంచే వెళుతోంది. ఎనిమిదేళ్లుగా తాపేశ్వరంలో హనీ ఫుడ్స్ అధినేత దేవు ఉమామహేశ్వరరావు స్వామివారికి కానుకగా అందజేస్తున్నారు. తేనెలొలికే మడత కాజాలకు పేరొందిన తాపేశ్వరం గ్రా మం గణేష్ లడ్డూల తయారీలోను గిన్నీస్ రికార్డుల ద్వారా విశ్వవిఖ్యాతమైన విషయం విదితమే.ప్రతీ ఏడాది భక్తుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంటాడు బాలాపూర్ గణపయ్య. గణేష్ నవరాత్రులు అయిపోతున్నయంటే చాలు అందరి దృష్టి ఈయనపై వైపే ఉంటుంది. బాలాపూర్ లడ్డూ వేలం పాట అప్పుడే మొదలవుతుంది కాబట్టి.
37 ఏళ్లుగా అంటే 1980లో బాలాపూర్ గణేశుని ప్రస్ధానం మొదలైంది. 23 ఏళ్లుగా లడ్డూ వేలం పాటతో బాలాపూర్ గణేశుడికి మరింత ఖ్యాతి పెరిగింది. ఈ గణేశుని దర్శనంకోసం స్థానికులే కాకుండా వివిధ ప్రాంతా లనుంచి భక్తులు వస్తారు. గణేశుడి చేతిలో ఉన్న లడ్డూ సొంతం చేసుకుంటే సిరిసంపదలు దక్కుతాయని భక్తుల విశ్వాసం. 1994 నుంచి బాలాపూర్ లో లడ్డూ వేలం పాట మొదలుపెట్టారు.
బాలాపూర్ గణేశుడి చేతిలో ఉండే లడ్డూను ఈసీఐఎల్ లోని తాపేశ్వరం హనీపుడ్స్ తయారుచేస్తుంది.
20 నుండి 25 కిలోల బరువు ఉండే ఈ లడ్డూను 2010 నుంచి బాలాపూర్ గణేశుడికి ఆ దుకాణ యజమాని ఉమామహేశ్వర్ రావు నైవేద్యంగా సమర్పిస్తున్నారు. లడ్డూతో పాటు 2 కిలోల వెండి గిన్నెను స్వామివారికి సమర్పించి భక్తిని చాటుకుంటున్నారు.బాలాపూర్ లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బును గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు, సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు.గతేడాది దాదాపు రూ. 14.7 లక్షలకు వేలంలో భక్తుడు దక్కించుకున్నారన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూను గురువారం స్వామివారికి సమర్పించనున్నట్టు ఉమామహేశ్వరరావు తెలిపారు.