ప్రపంచ కప్ లో భాగంగా నిన్న మంగళవారం టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టుతో తలపడిన సంగతి విదితమే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 104(90బంతుల్లో 5సిక్సర్లు,7ఫోర్లతో)రాణించడంతో పాటు కేఎల్ రాహుల్ 77(92బంతుల్లో 1సిక్సరు,6ఫోర్లు)సాధించడంతో నిర్ణీత ఓవర్లకు తొమ్మిది వికెట్లను కోల్పోయి 314పరుగులను సాధించింది.లక్ష్యచేధనలో బుమ్రా (4/55), హార్దిక్ పాండ్యా (3/60) ధాటికి 48 ఓవర్లలో 286 పరుగులకు బంగ్లా ఆలౌటైంది.
దీంతో భారత్ ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించడంతో సెమీఫైనల్ కెళ్లింది. అయితే ఈ మ్యాచ్లో ఒక బామ్మ మాత్రం అందరి దృష్టిని ఆకర్శించింది. ఎంతహా అంటే స్టేడియంలో ఉన్న అన్ని కెమెరాల కళ్లన్నీ ఆమెపైనే నిలిచాయి. చిన్న పిల్లలా.. తన రెండు బుగ్గలపై త్రివర్ణ పతాక వర్ణాలను చిత్రించుకొని, చేతిలో భారత పతాకాన్ని పట్టుకొని, నోట్లో బూర ఉంచుకొని మ్యాచ్ ఆసాంతం దాన్ని ఊదుతూ తోటి ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపింది. అలా 8గంటలపాటు స్టేడియంలో అలుపూసొలుపూ లేకుండా టీమిండియాను ప్రోత్సహించిన ఆమె పేరు చారులత పటేల్.
బ్రిటన్‌కు చెందిన ఆమె వయస్సు 87 సంవత్సరాలు. ఈ వయస్సులోనూ ఆమె ఉత్సాహాన్ని చూసి కోహ్లీసేన కూడా ఫిదా అయింది.మ్యాచ్ ముగిశాక విరాట్‌తో పాటు రోహిత్ ఆమె వద్దకు వచ్చి నవ్వుతూ కొద్దిసేపు ముచ్చటించారు. ఆమె కూడా ఆటగాళ్లను ఆప్యాయంగా పలకరించి మురిసిపోయింది. ఆమె ఉత్సాహాన్ని కామెంటేటర్ గంగూలీ తెగ పొగిడాడు. ఈ బామ్మ గురించి తెలుసుకున్న మహీంద్ర గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహేంద్ర ఒక హామీ ఇచ్చారు. ఆమె ఎవరో తెలుసుకుని.. తదుపరి జరగబోయే టీమిండియా మ్యాచ్‌లకు ఆమె టికెట్లకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తానే చెల్లిస్తానని ఆనంద్ మహీంద్ర తన అధికారక ట్విట్టర్ ఖాతా సాక్షిగా ప్రకటించారు.