జనసేన పార్టీపై జూనియర్ ఆర్టిస్ట్ బోయ సునీత సంచలన ఆరోపణ చేశారు. జనసేన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తే సినిమాల్లో అవకాశాలిప్పిస్తామని చెప్పి, మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఎన్నికలు ముగిసిన తరువాత వారంతా ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు సినీ పెద్దల తీరుకు నిరసనగా ఆమె హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో గొలుసులతో తనను తాను నిర్బంధించుకున్నారు. బుధవారం రాత్రంతా ఫిల్మ్ ఛాంబర్ లోనే గడిపారు. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ సిబ్బంది పోలీసులు ఫిర్యాదు చేశారు. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించారు. గత ఎన్నికల్లో ఆమె జనసేన పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేసారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్ సభ పరిధిలో, పవన్ కల్యాణ్ బరిలో నిలిచిన భీమవరం, గాజువాకల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తానే కాకుండా తనకు పరిచయం ఉన్నవారితో ఆమె జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా నిర్మించే సినిమాల్లో అవకాశాలిస్తామని ఆశ చూపడం వల్లే తాను పార్టీకోసం పనిచేసానని, తన సొంతం డబ్బు పెట్టుకున్నానని సునీత ఆరోపిస్తున్నారు. ఎన్నికలు అయిపోయాక పార్టీ నాయకత్వం గానీ, గీతా ఆర్ట్స్ బ్యానర్ వాళ్లు కానీ, తనకు అవకాశాలు ఇప్పిస్తామని ఆశ చూపిన నిర్మాత బన్నీ వాసు తనను పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు.
