18ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన సింధియా మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ వైఖరితో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.దీంతో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్న సింధియా కీలక అంశాలను లేఖలో పేర్కొన్నారు.
‘కాంగ్రెస్‌లో ఉండి దేశానికి ఏమీ చేయలేకపోతున్నా..అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేశాను. కాంగ్రెస్‌లో సముచిత స్థానం లభించలేదు. ఏడాదికాలంగా పార్టీని వీడాలనుకుంటున్నా. మొదటి నుంచి రాష్ట్రానికి, దేశానికి సేవచేయాలనేదే నా కోరిక, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పని చేయలేకపోతున్నాను. కాంగ్రెస్‌లో తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. భవిష్యత్‌ను నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందని’ సింధియా పేర్కొన్నారు.
గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా 2002లో తన తండ్రి మాధవరావు మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత 2002,2004,2009,2014ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. కేంద్ర మంత్రిగా కూడా సింధియా పని చేశారు. రాహుల్ గాంధీ,సింధియా మంచి స్నేహితులు. 2018లో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు. అయిన సీఎం పదవీ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
Post Views: 303