Home / LIFE STYLE / కరోనాపై సమరంలో గెలుపు దిశగా

కరోనాపై సమరంలో గెలుపు దిశగా

కరోనాతో సమరంలో ప్రపంచం ఓడిపోయిందా? కరోనాపై ఎత్తిన కత్తిని అన్ని దేశాలు ఒక్కొక్కటిగా దించేస్తున్నాయా? కరోనాను కంటిచూపుతో చంపేస్తాం, ఆ వైరస్‌ను నల్లిని నలిపినట్లు నలిపేస్తాం, కత్తికో కండగా నరికేస్తాం అని బీరాలు పలికిన దేశాలన్నీ ఇప్పుడు ఆ వైరస్‌తో సహజీవనానికి సిద్ధమవుతున్నాయా? గిర్రున రోజులు తిరుగుతున్నా, క్యాలెండర్‌లో నెలల షీట్స్ సర్రున చిరిగిపోతున్నా ప్రపంచవ్యాప్తంగా కూడా తగ్గని కరోనా కేసులు ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం చెబుతున్నాయి..

ప్రపంచానికి చైనా కానుకగా ఇచ్చిన కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలన్నీ సర్దుకుపోయి కలిసి కాపురం చేయడానికి సిద్ధమవుతున్నాయి.. కరోనా వైరస్‌ సృష్టించబడ్డ చైనాలో తప్పితే ప్రపంచంలోని ఇంకే దేశంలోనూ ఆ వైరస్‌ కంట్రోల్‌లో లేదు. చైనా వదిలిన కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ కూడా అన్నీ మూతేసుకుని మూసుకుకూర్చుని మూడు నెలలు దాటిపోతోంది. చిన్న దేశాలే కాదు, అగ్రరాజ్యాల ఆర్ధిక వ్యవస్థలు కూడా కరోనా దెబ్బకు కుదేలయ్యాయి. కొన్ని దేశాలైతే ఎప్పటికి కోలుకుంటాయో కూడా చెప్పలేని పరిస్థితి. అమెరికా అగ్రరాజ్యంగా అవతరించాక ఇంతటి ఎదురు దెబ్బ ఎప్పుడూ తినలేదు. బ్రిటన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, భారత్‌, బ్రెజిల్‌, రష్యా వంటి దేశాల ఆర్ధిక వ్యవస్థలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి..

మూడు నెలలుగా ప్రపంచమంతా మడికట్టుకుని కూర్చున్నట్లు వుండిపోయింది. మూడునెలలుగా లాక్‌డౌన్‌తో ప్రతిష్టంభన, దేశాల మధ్యే కాదు, రాష్ట్రాల మధ్య, జిల్లాల మధ్య, తాలూకాల మధ్య, ఆఖరుకు ఇంటికి ఇంటికి మధ్య కూడా సంబంధాలు తెంపుకున్నా కరోనా కేసులు శూన్యం కావడం అటుంచి, లక్షలకు లక్షలు లెక్కన పెరుగుతూనే వున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా తమ ఇతర పనులన్నీ మానుకుని, అన్ని కార్యకలాపాలను స్థంభింప చేసుకుని కరోనా వైరస్‌పై సమరం ఒక్కటే పనిగా పెట్టుకుని ఇంతకాలం పోరాడాయి.. ఇప్పుడు ఏతావాతా అందరూ తెలుసుకున్నదేమిటంటే కరోనా వైరస్‌ కేసులను జీరో చేయడం కష్టమని. ప్రపంచంలో పుట్టిన ఏ వైరస్‌ కూడా ఇంతవరకు పూర్తిగా అంతం కాలేదు. కాకపోతే వాటికి వ్యాక్సిన్‌లు మందులు వచ్చాక నియంత్రణలో వుంటున్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలు చేయాల్సిన పని కూడా వీలైనంత తొందరగా కరోనాకు విరుగుడుగా వ్యాక్సిన్‌లు, ఔషధాలు కనిపెట్టడమే..

మూడు నెలల లాక్‌డౌన్‌ ఆయుధంతో ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌తో యుద్ధం చేశాయి. అది అదుపులోకి రాలేదు. ఇప్పుడు వైరస్‌తో కలిసి నడుస్తూనే దానిని నియంత్రణలోకి తెచ్చుకునే మార్గాలను అన్వేషించాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్‌ నుండి బయటపడుతున్నాయి. ప్రతిరోజూ కరోనా కేసులను లెక్కేసుకుంటుంటే అవి లక్షలు దాటి కోట్లలోకి కూడా వెళతాయి, లెక్కపెట్టుకుంటూ పోతే ప్రతిరోజూ కేసులే! ఇదే ఒక దినచర్యగా మారుతోంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇక కరోనా గణాంకాలను నిలిపేయడం ఉత్తమం. ప్రతి దేశం కూడా కరోనా నియంత్రణకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి. ఒకప్పటి క్షయ ఆసుపత్రుల మాదిరిగా ఇప్పుడు ప్రతి ప్రాంతంలోనూ కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చెయ్యాలి. ప్రతిరోజూ కేసుల లెక్కలు తేబల్లేదు, వైరస్‌ వచ్చిన వారిని ఆ ఆసుపత్రులలో చేరుస్తుంటే చాలు.. కేవలం కరోనా వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం చేయడం కరెక్ట్‌ కాదు. ప్రభుత్వాలే ఆ భారాన్నంతా మోయాలన్నా కష్టమే! ప్రైవేట్‌ ఆసుపత్రులో కూడా కరోనా సేవలందించేలా ప్రభుత్వాలు మార్గదర్శకాలు నిర్ధేశించాలి. కరోనాతో ఇంకొంత కాలం మనకు సహజీవనం తప్పదనుకున్నప్పుడు ట్రాఫిక్‌ రూల్స్‌ మాదిరిగానే కరోనా రూల్స్‌ కూడా తీసుకురావాలి.. భౌతిక దూరం, మాస్క్‌, శానిటైజేషన్‌ వంటి నిబంధనలు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక భాగంగా మారిపోవాలి.
లాక్‌డౌన్‌ ఎత్తేసి నిబంధనలు సడలిస్తున్నంత మాత్రాన కరోనా యుద్ధం పూర్తిగా ముగిసినట్లు కాదు. లాక్‌డౌన్‌ అన్నది కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రజలకు ఇచ్చే శిక్షణ లాంటిదే! లాక్‌డౌన్‌తోనే కేసులు జీరో కావు. కాకపోతే ఈ లాక్‌డౌన్‌ సమయం కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రజలకు అవగాహన పెంచేందుకు ఉపయోగపడింది.. ఈ అవగాహన వుంటేనే వైరస్‌తో నిరంతరం యుద్ధం చేయగలం.. వైరస్‌ పూర్తిగా అంతమయ్యే వరకు పోరాడగలం..

ఒక పోలియో.. ఒక టి.బి.. ఈ వైరస్‌లను సుదీర్ఘ పోరాటంతోనే మనిషి జయించగలిగాడు. ఈ కరోనా వైరస్‌ ఇంతే… ఓ వైపు జీవన పోరాటం చేస్తూనే ఇంకోవైపు దీంతో నిరంతర యుద్ధం చేస్తేనే ఏదో ఒకరోజు అది మన నియంత్రణలోకి వస్తుంది.
ఈ సమరంలో భాగంగా అగ్రదేశాలు కరోనా వ్యాక్సిన్‌ తయారీ కోసం నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రపంచానికి చైనా ఈ వైరస్‌ విషయంలో సహకరించి వుంటే సరైన సమాచారం అందించి వుంటే… ఈపాటికే వ్యాక్సిన్‌ వచ్చుండేది! అయినా కూడా వాళ్ళతో సంబంధం లేకుండా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ వ్యాక్సిన్‌ రూపకల్పనలో దూసుకుపోతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ కల్లా వ్యాక్సిన్‌ను ప్రపంచానికి అందించాలనే సంక్పల్పంతో పనిచేస్తోంది. ఆ సంక్పల్పం విజయవంతమైతే కరోనాపై సమరంలో గెలుపు దిశగా ముందడుగు పడినట్లే….