Home / SLIDER / తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి హరీష్ దిమ్మతిరిగే షాక్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి హరీష్ దిమ్మతిరిగే షాక్

బీడీ కార్మికులకు ఇచ్చే రూ.2వేల పింఛన్‌లో కేంద్రప్రభుత్వమే రూ.1,600 ఇస్తున్నదంటూ కమలనాథులు గోబెల్స్‌ను మించి ప్రచారం చేస్తున్నారని ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం అందించే పింఛన్లతోపాటు, కేసీఆర్‌ కిట్లకిచ్చే డబ్బంతా కేంద్రానిదే అన్నట్టు వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దుబ్బాకలో ఎన్నికల పేరుతో బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు.

‘బీజేపీనేతలు చేస్తున్న ప్రచారం వాస్తవమైతే, వారు దుబ్బాక బస్టాండ్‌ సెంటర్‌కు వచ్చి ప్రజల మధ్య నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు నేను రాజీనామా చేస్తాను. నిరూపించకపోతే బండి సంజయ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు, ఎంపీగా రాజీనామా చేయాలి’ అని సవాల్‌ విసిరారు. సోమవారం సిద్దిపేటలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

బీజేపీ నాయకులు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను విడుదల చేశారు. బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.2వేల పింఛన్‌లో కేసీఆర్‌ ఇచ్చేది రూ.రూ.400 మాత్రమేనని.. మోదీనే రూ.1600 ఇస్తున్నారంటూ బీజేపీ నేతలు దుబ్బాకలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీశ్‌ విమర్శించారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో అసలు బీడీ కార్మికులకు పింఛన్‌ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.

గుజరాత్‌లో వృద్ధాప్య పింఛన్లే రూ.500 ఇస్తున్నారని.. అలాంటిది తెలంగాణలో బీడీ కార్మికులకు రూ.1600 ఇస్తున్నారంటే మనం నమ్మాలా? అంటూ ఎద్దేవా చేశారు. సంజయ్‌ ఎంపీగా ఉన్న కరీంనగర్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్‌ ఒకరు బీడీ కార్మికురాలితో మాట్లాడిన మాటలను ప్రజలంతా విన్నారని చెప్పారు.

దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో కొంతకాలంగా బీజేపీ నాయకులు గోబెల్స్‌ కంటే మించిపోతున్నారని విమర్శించారు. ‘రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా కేంద్రం నుంచి ఒక్కరూపాయి వచ్చినా నాకు తెలుస్తుంది. ఖర్చు పెట్టే ప్రతిపైసా నా దృష్టికి వస్తుంది. పదహారొందలు కాదుకాదా.. కేంద్ర ఒక్కపైసా కూడా ఇవ్వడం లేదు’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.