Home / HYDERBAAD / గ్రేటర్ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు

గ్రేటర్ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు

ఎవరో కొందరి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు, ప్రేలాపనలకు ఆగం కావొద్దని హైదరాబాద్‌ నగర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. ఒకవేళ వారి మాటలకు ఆగమైతే హైదరాబాద్‌ మొత్తం ఆగమైతదని, అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని చెప్పారు. హైదరాబాద్‌ ఆగమైతే భూముల, ఆస్తుల విలువలు పోతయని, వ్యాపారాలు బందైతయని, పిల్లలకు ఉద్యోగాలు రావని అన్నారు. కళకళలాడే హైదరాబాద్‌ను అందరం కలిసి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ప్రచారసభలో సీఎం మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

మన పిల్లల భవిష్యత్తు.. మన నగర భవిష్యత్తు. ఒక ఉజ్వలమైన నగరాన్ని ఇంకా ఉజ్వలంగా ముందుకు తీసుకొని పోవాలె. గొప్పగా ముందుకు పోతున్న నగరానికి ఇంకా గొప్పతనాన్ని ఆపాదించుకోవాలి. మన హైదరాబాద్‌ చాలా చైతన్యవంతమైన నగరం. ఎంతో చరిత్ర ఉన్న నగరం. ఎన్నో మంచి చెడ్డలకు సాక్ష్యంగా నిలిచిన నగరం. అందరం  చిరునవ్వుతో.. సంతోషంతో కళకళలాడే హైదరాబాద్‌ను కలిసి కాపాడుకుందం.

ఒక శ్రేష్ఠమైనటువంటి హైదరాబాద్‌ తయారుకావాలె. అత్యంత నివాసయోగ్య నగరం కావాలె. అందుకోసం బ్రహ్మాండంగా మనం ముందుకు పోవాలి. అదే విధంగా మేం పనిచేస్తం. అది మా ధర్మంగా భావిస్తా ఉన్నం. కొందరికోసం పనిచేసి అందరి హైదరాబాద్‌ను ఆగం చేసే పరిస్థితి మాది కాదు. ఆ ఎజెండా కూడా మాది కాదు.