Home / LIFE STYLE / మద్యం తాగేవాళ్లకు హెచ్చరిక..?

మద్యం తాగేవాళ్లకు హెచ్చరిక..?

ఫుల్ గా మద్యం సేవించేవారికి శాస్త్రవేత్తలు ఓ హెచ్చరిక చేశారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా పురుషుల్లో డీఎన్‌ఏ కూడా మారిపోతుందని స్పష్టంచేశారు. ఈ దురలవాటును మానుకున్నా.. సదరు మార్పులు ఒక పట్టాన సర్దుకోవని చెప్పారు. కనీసం 3 నెలల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

మితిమీరిన మద్యపానం వల్ల తొలుత ‘ఆల్కాహల్‌ యూజ్‌ డిజార్డర్‌’ (ఏయూడీ) తలెత్తుతుందని వారు చెప్పారు. ‘‘దీనికి చికిత్స చేయడం కోసం వైద్యులు చాలావరకూ.. వారిని మద్యానికి దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. అయినప్పటికీ ఈ రుగ్మత బారినపడ్డ పురుషుల డీఎన్‌ఏలో మార్పులు జరిగాయి. మద్యం మోతాదు తగ్గించుకున్న, పూర్తిగా మానేసిన సందర్భాల్లోనూ ఏయూడీతో వచ్చిన మార్పులు కనీసం మూడు నెలలు కొనసాగినట్లు వెల్లడైంది’’ అని శాస్త్రవేత్తలు చెప్పారు.

21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న 52 మంది పురుషులపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ మేరకు వెల్లడైంది. ఏయూడీతో రుగ్మత కారణంగా డీఎన్‌ఏలో మిథైల్‌ గ్రూప్స్‌ వచ్చి చేరుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అవి డీఎన్‌ఏలో మార్పులు కలిగిస్తాయని చెప్పారు. అయితే జన్యుక్రమాన్ని మార్చబోవని వివరించారు. ఏయూడీ వల్ల ఏటా 30 లక్షల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. భారత్‌లో 15 నుంచి 54 ఏళ్ల మధ్య వయసువారిలో 29 శాతం మంది మద్యాన్ని సేవిస్తారని అంచనా. వారిలో 12 శాతం మంది రోజూ మందు తాగుతారని, 41 శాతం మంది వారానికోసారి మద్యం పుచ్చుకుంటారని పరిశోధకులు తెలిపారు…..