Home / SLIDER / కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు

కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు

కాంగ్రెస్ ముసుగులో చంద్ర‌బాబు మ‌ళ్లీ తెలంగాణ‌లోకి వ‌స్తున్నార‌ని రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు. టీడీపీ ముఖం పెట్టుకుని వ‌స్తే తెలంగాణ ప్ర‌జ‌లు రానివ్వ‌ర‌ని, త‌న మ‌న‌షుల‌కు కాంగ్రెస్‌లోకి పంపి రాష్ర్టంలో చంద్ర‌బాబు అడుగు పెడుతున్నార‌ని తెలిపారు. 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెల‌వాల‌ని ప్ర‌య‌త్నిస్తే.. ఆంధ్రాబాబు అని చంద్ర‌బాబును ప్ర‌జ‌లు త‌రిమేశారు అని గుర్తు చేశారు. చంద్ర‌బాబు కాంగ్రెస్ పార్టీలో త‌న వాళ్ల‌కు ప‌ద‌వులు ఇప్పించుకుంటున్నారు. ఓటుకు నోటు కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డి.. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు అని అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డే పీసీసీ చీఫ్‌గా వ‌చ్చాడు అని హ‌రీష్ రావు పేర్కొన్నారు.

సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండ‌లం క‌ల్లెప‌ల్లి గ్రామంలో ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌తో క‌లిసి మంత్రి హ‌రీష్ రావు ప‌ర్య‌టించారు. క‌ల్లెప‌ల్లిలో గ్రామ మహిళా సమాఖ్య‌ భవనాన్ని, అంబేద్కర్ భవనాన్ని, రైతు వేదికను మంత్రి హ‌రీష్ రావు ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బెజ్జంకి తరపున రూ.80 వేల విలువ కలిగిన బాడీ ఫ్రీజర్ – శవ పేటికను కల్లెపల్లి గ్రామ పంచాయితీకి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా క్లబ్ సభ్యులైన మోహన్, రవీంద్ర ప్రసాద్‌ల‌ను మంత్రి హ‌రీష్ రావు, ఎమ్మెల్యే ర‌స‌మ‌యి అభినందించారు.

కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు
ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. బెజ్జంకిలో గ్రామ మహిళా సమాఖ్య‌ భవనాన్ని, అంబేద్కర్ భవనాన్ని, రైతు వేదికను ప్రారంభించుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. క‌ల్లెప‌ల్లి గ్రామ అభివృద్ధి ప‌నుల కోసం రూ. కోటి మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. బెజ్జంకిలో రూ. 20 కోట్ల‌తో మార్కెట్‌యార్డు, గోదాములు, స‌బ్ మార్కెట్‌యార్డులు ఏర్పాటు చేసుకున్నామ‌ని తెలిపారు. తెలంగాణ రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత కుంట‌లు, చెరువులు నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. కాంగ్రెస్ హ‌యాంలో క్రాప్ లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉండేది. కానీ టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో మాత్రం రైతుల ఖాతాల‌కు నేరుగా రైతుబంధు ప‌థ‌కం కింద న‌గ‌దు జ‌మ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ధ‌ర‌లు పెంచి సామాన్యుడి న‌డ్డి విరుస్తోంద‌ని మండిప‌డ్డారు. ఏడేళ్ల‌లో బీజేపీ దేశానికి చేసిందేమీ లేద‌ని మంత్రి హ‌రీష్ రావు అన్నారు.