Home / SLIDER / టీమ్‌ఇండియా మరో అద్భుత విజయం

టీమ్‌ఇండియా మరో అద్భుత విజయం

పనైపోయిందన్న ప్రతీసారి తిరిగి పుంజుకుని సత్తాచాటడాన్ని అలవాటుగా మార్చుకున్న టీమ్‌ఇండియా మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లార్డ్స్‌లో అద్వితీయ విజయం తర్వాత.. లీడ్స్‌లో ఇన్నింగ్స్‌ పరాజయం చవిచూసిన భారత జట్టు.. ఓవల్‌లో గోడకు కొట్టిన బంతిలా విజృంభించింది. బ్యాట్స్‌మెన్‌ ప్రతాపానికి.. బౌలర్ల సహకారం తోడవడంతో సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో కోహ్లీసేన 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్‌ గడ్డపై ఒకే సిరీస్‌లో భారత్‌ రెండు టెస్టులు నెగ్గడం గత 35 ఏండ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైన భారత జట్టు.. ప్రత్యర్థిని 290 పరుగులకు కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ సెంచరీకి తోడు శార్దూల్‌ ఠాకూర్‌, రిషబ్‌ పంత్‌ అర్ధ శతకాలతో మెరువడంతో 466 పరుగులు చేసి.. ప్రత్యర్థికి 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

టార్గెట్‌ ఛేజింగ్‌లో ఇంగ్లిష్‌ జట్టుకు శుభారంభం దక్కినా.. ఆట ఆఖరి రోజు మన బౌలర్లు దుమ్మురేపారు. ఉమేశ్‌ యాదవ్‌ (3/60), జస్ప్రీత్‌ బుమ్రా (2/27), రవీంద్ర జడేజా (2/50), శార్దూల్‌ ఠాకూర్‌ (2/22) ధాటికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రోరీ బర్న్స్‌ (50), హసీబ్‌ హమీద్‌ (63) అర్ధశతకాలు సాధించగా.. కెప్టెన్‌ జో రూట్‌ (36) ఫర్వాలేదనిపించాడు. తక్కినవాళ్లంతా పెవిలియన్‌కు వెళ్లేందుకు పోటీపడ్డారు. విదేశీ గడ్డపై తొలి టెస్టు సెంచరీ నమోదు చేసుకున్న రోహిత్‌ శర్మకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు శుక్రవారం నుంచి మాంచెస్టర్‌లో ప్రారంభం కానుంది.

బుమ్రా బుల్లెట్‌ వేగంతో..
అతి తక్కువ టెస్టుల్లో వంద వికెట్లు పడగొట్టిన భారత పేసర్‌గా జస్ప్రీత్‌ బుమ్రా రికార్డుల్లోకెక్కాడు. హర్యానా హరికేన్‌ కపిల్‌ దేవ్‌ 25 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధిస్తే.. బుమ్రా 24 టెస్టుల్లోనే మూడంకెలు దాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో పోప్‌ వికెట్‌ పడగొట్టడంతో ద్వారా బుమ్రా ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

భారత్‌
100 వికెట్ల పేస్‌ క్లబ్‌
1, బుమ్రా 24 టెస్టుల్లో

2, కపిల్‌దేవ్‌ 25 టెస్టుల్లో
3, ఇర్ఫాన్‌ 28 టెస్టుల్లో
4, షమీ 29 టెస్టుల్లో

ఐదు దశాబ్దాల తర్వాత ఓవల్‌లో భారత్‌ టెస్టు విజయం సాధించింది. 1971లో తొలిసారి ఇక్కడ టెస్టు మ్యాచ్‌ నెగ్గిన టీమ్‌ఇండియా యాభై ఏండ్ల తర్వాత తిరిగి గెలుపు రుచి చూసింది.

ఈ పరాజయం బాధిస్తున్నది. ఆఖరి రోజు ఆట ప్రారంభానికి ముందు విజయం సాధిస్తామనే అనుకున్నాం. కానీ భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ఫలితాన్ని తారుమారు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లోనే ఇంకాస్త ఎక్కువ ఆధిక్యం సాధిస్తే బాగుండేదేమో.

  • జో రూట్‌, ఇంగ్లండ్‌ కెప్టెన్‌

కుర్రాళ్లు చక్కటి ప్రదర్శన కనబర్చారు. తొలి ఇన్నింగ్స్‌లో వంద పరుగులు వెనుకబడ్డ తర్వాత తిరిగి పుంజుకోవడం మామూలు విషయం కాదు. ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయగలమని బలంగా నమ్మాం. మా బౌలర్లు దాన్ని నిజం చేసి చూపించారు.

  • కోహ్లీ, భారత కెప్టెన్‌

స్కోరు బోర్డు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 191, ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 290, భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 466, ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (సి) పంత్‌ (బి) శార్దూల్‌ 50, హమీద్‌ (బి) జడేజా 63, మలన్‌ (రనౌట్‌) 5, రూట్‌ (బి) శార్దూల్‌ 36, పోప్‌ (బి) బుమ్రా 2, బెయిర్‌స్టో (బి) బుమ్రా 0, అలీ (సి) (సబ్‌) సూర్యకుమార్‌ (బి) జడేజా 0, వోక్స్‌ (సి) రాహుల్‌ (బి) ఉమేశ్‌ 18, ఓవర్టన్‌ (బి) ఉమేశ్‌ 10, రాబిన్‌సన్‌ (నాటౌట్‌) 10, అండర్సన్‌ (సి) పంత్‌ (బి) ఉమేశ్‌ 2, ఎక్స్‌ట్రాలు: 14, మొత్తం: 210. వికెట్ల పతనం: 1-100, 2-120, 3-141, 4-146, 5-146, 6-147, 7-182, 8-193, 9-202, 10-210, బౌలింగ్‌: ఉమేశ్‌ 18.2-2-60-3, బుమ్రా 22-9-27-2, జడేజా 30-11-50-2, సిరాజ్‌ 14-0-44-0, శార్దూల్‌ 8-1-22-2.