Home / SLIDER / భవిష్యత్తులో రెడ్డి కార్పొరేషన్‌

భవిష్యత్తులో రెడ్డి కార్పొరేషన్‌

తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకుండానే 10 శాతం ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లు అమలుచేస్తున్నట్టుగానే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులతో భవిష్యత్తులో రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తామని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు హామీ ఇచ్చారు. రెడ్డి కులస్తుల్లోని పేదలకు కూడా కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, కేసీఆర్‌ కిట్స్‌ వంటివి అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

అన్ని వర్గాల్లోని పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. హుజూరాబాద్‌లో న్యాయానికీ అన్యాయానికీ.. ధర్మానికీ అధర్మానికీ మధ్య యుద్ధం జరుగుతున్నదని, రెడ్డి సోదరులు ధర్మయుద్ధం చేస్తున్న టీఆర్‌ఎస్‌ వైపు నిలబడాలని కోరారు. గెల్లు శ్రీనివాస్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆయనను గెలిపిస్తే సొంత స్థలం ఉన్నవారికి డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టిచ్చే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. టీఆర్‌ఎస్‌ బలాన్ని చూసి బీజేపీ గుండెలు అదురుతున్నాయని ఎద్దేవా చేశారు.

టీఆర్‌ఎస్‌ సభలకు జనం ప్రభంజనంలా కదిలివస్తుంటే, చూసి ఓర్వలేక ఈటల రాజేందర్‌ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైతుల కోసం రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయో బేరీజు వేయాలని కోరారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు.

వ్యవసాయ బావులు, బోర్లకు కరెంటు మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం చెప్తున్నదని, కాళేశ్వరం మీద పెత్తనానికి ప్రయత్నిస్తున్నదని చెప్పారు. డీజిల్‌ ధరలు పెంచి, వ్యవసాయాన్ని భారంగా మారుస్తున్నదని దుయ్యబట్టారు. బీజేపీని గెలిపిస్తే పెంచిన డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గిస్తామని దమ్ముంటే ఈటల చెప్పాలని సవాల్‌ విసిరారు.