కాంగ్రెస్ 2004 నుంచి 2014 మధ్య పదేళ్ల కాలంలో రూ.12,173 కోట్లు ఖర్చు చేసింది. ఏడేళ్లలో తెరాస ప్రభుత్వం రూ.58,303 కోట్లు వెచ్చించింది. ఇది మేం చెబుతున్న విషయం కాదు. కాగ్ నివేదిక’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.శాసనసభలో గురువారం పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ”ప్రతి పంచాయతీలో అయిదు నుంచి పది ఎకరాల్లో బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో 100 చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. పచ్చదనం పెంపునకు ప్రత్యేకంగా బడ్జెట్ ఏర్పాటు చేస్తున్నాం.
పల్లెలకు, పట్టణాలకు ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రతిపక్ష సభ్యులు పదేపదే అంటున్నారు. 2004-2014 మధ్య కాలంలో కాంగ్రెస్ గ్రామీణ మంచినీటి సరఫరాకు రూ.4,198 కోట్లు ఖర్చు చేస్తే ఏడేళ్లలో తెరాస రూ.36 వేల కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 13,875 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి రూ.3,618 కోట్లు ఖర్చు చేస్తే తెరాస 18,606 కిలోమీటర్ల రోడ్లకు రూ.8,536 కోట్లు వ్యయం చేసింది. గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ రూ.4,357 కోట్లు సమకూర్చితే తెరాస రూ.13,667 కోట్లు ఇచ్చింది.
నిధుల కేటాయింపులో మా ప్రభుత్వానికి పక్షపాతం లేదు. ప్రత్యేక అభివృద్ధి ఖాతా (ఎస్‌డీఏ) ద్వారా కూడా చాలా జిల్లాలకు రూ.949 కోట్ల సీఎం నిధి ఇచ్చాను. 15వ ఆర్థిక సంఘం జిల్లా పరిషత్‌లను పట్టించుకోలేదు. ఆ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు జిల్లా, మండల పరిషత్‌లకు రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.1500 కోట్లు ఇచ్చాం.
భట్టివిక్రమార్క చెప్పినట్లు ఎక్కడో ఓచోట అభివృద్ధి విషయంలో తేడాలు ఉండొచ్చు. వాటిని మంత్రుల దృష్టికి తీసుకొచ్చినా, నాకు లేఖరాసినా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల స్వీకరణ తేదీ గడువును ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం పెంచింది. అలా పెంచుకుంటూ పోతే ఆక్రమణలు ఆగవు.
ధరణి, ఇతర భూ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. ఇతరత్రా సమస్యలపై ఎంఐఎం ఎమ్మెల్యేలతో నగరానికి చెందిన మంత్రులు ప్రత్యేకంగా సమావేశం కావాలి. స్మార్ట్ నగరాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర నిధులు కలిపి రూ.1750 కోట్లతో పనులు జరుగుతున్నాయి. విమానాశ్రయం వైపు పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసే అంశం పరిశీలిస్తాం. భాజపా సభ్యుడు రఘునందన్‌రావు సూచన మేరకు గచ్చిబౌలి మైదానంలో టిమ్స్ నిర్మాణ ప్రణాళికపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలన చేసి ఆటలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతారు” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.