లంచాలు తీసుకుని ఇండ్లు ఇస్తామని చెప్తే నమ్మొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇండ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట డివిజన్ చాచా నెహ్రూనగర్‌లో నూతనంగా నిర్మించిన 248 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని పేదలందరికి ఇండ్లు అందించే ప్రయత్నం చేస్తామన్నారు.
నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని చెప్పారు. రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ప్రారంభించామని వెల్లడించారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడని పెద్దలు అంటారు.. అయితే ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లీ నేనే చేస్తానన్న ఏకైక సీఎం కేసీఆరే అని చెప్పారు. మార్కెట్‌లో రూ.40 లక్షల విలువచేసే ఇంటిని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.