Home / EDITORIAL / రాష్ర్టాలు అధికారాలు అడిగితే రాజద్రోహమా?

రాష్ర్టాలు అధికారాలు అడిగితే రాజద్రోహమా?

రాజ్యాంగాన్ని మార్చమంటే రాజద్రోహం కేసు పెట్టాలనడం రాజ్యాంగానికి వ్యతిరేకమైన మాట. అదీ ముఖ్యమంత్రి మీద. ఇది అధికార దుర్వినియోగం, ప్రాథమిక హక్కులకు భంగం. ఎంపీలు, మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు రాజ్యాం గం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తామని వారుచేసిన ప్రమాణం గుర్తు పెట్టుకోవాలి. రాజ్యాంగ మార్పు అనేది రాజ్యాంగపరమైన డిమాండ్‌ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాజద్రోహం కేసులు పెట్టడానికి బ్రిటిష్‌ పాలనలో ఉన్నామా?.1950లో జనం తమకోసం రాసుకొని తమకే ఇచ్చుకున్న రాజ్యాంగాన్ని తర్వాత తరాల వారు మార్చుకోవచ్చునని రాజ్యాంగ ముఖ్య నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ అనేకమార్లు చెప్పారు. కొత్త రాజ్యాంగం కావాలనడం పాత రాజ్యాంగాన్ని అవమానించడం కాదు. 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో కేటాయింపు లోపాలను దుయ్యబడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త రాజ్యాం గం రాయాలన్నారు. గత 72 ఏండ్లుగా రాజ్యాంగం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని విమర్శిస్తూ కొత్త ఆలోచన, కొత్త దృక్పథం, కొత్త ప్రయత్నాలు జరగాలన్నారు. కాదనండి, లేదనండి. కానీ రాజద్రోహ నేరం మోపాలంటారా?

ఎందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విధంగా అడుగుతున్నారనేది ఆలోచించాల్సిన విషయం. రాష్ర్టాలకు రాజ్యాంగం నిర్ధారించిన అధికారాలను ఢిల్లీ ప్రభుత్వాలు వరసగా గుంజుకుంటూ ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. (ఇండియన్‌ యూనియన్‌) భారత సంఘ పాలనాధికారం సాధించిన పార్టీలు వరసగా రాష్ర్టాలను బలహీనపరుస్తున్నాయనడంలో అవాస్తవమేమీ లేదు. ఎనిమిదేండ్ల నుంచి కొత్తగా వచ్చిన ఏ చట్టమైనా అధికారాల కేంద్రీకరణే చేసింది. రాష్ర్టాలను ఏ అధికారాల్లేని నామమాత్ర ప్రభుత్వాలుగా మార్చడానికే ఈ చట్టా లా?

రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రిమండలికి, శాసనసభ కు ఉన్న అధికారాల కన్నా, విపరీతమైన అధికారం యూనియన్‌ మంత్రులకు, మంత్రిత్వశాఖలకు ఎక్కడినుంచి ఇస్తున్నారు? రాష్ర్టాల అధికారాలను లాక్కొని ఢిల్లీ ఐఏఎస్‌ అధికారుల చేతుల్లో పెట్టి, వారి మీద మంత్రుల పెత్తనాన్ని పదిలం చేసుకునే అధికారం ఎక్కడిది? రాజ్యాంగం సమాఖ్య నియమాలను రచించి, రాష్ర్టాల స్వయం పాలనాధికారాలను రక్షించడం ఢిల్లీ బాధ్యత అని నిర్దేశించింది, ఢిల్లీ సుల్తాన్లకు ఈ విషయం తెలుసా?

దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు, జాతీయాభివృద్ధి ప్రణాళికల బాధ్యతల విషయంలో తప్ప మిగిలిన అధికారాలన్నీ రాష్ర్టాలవే. యూనియన్‌, రాష్ర్టాల మధ్య అధికారాల పంపిణీకి మూడు జాబితాలను రాజ్యాంగం నిర్దేశించింది. యూనియన్‌ జాబితాకే ఢిల్లీ సుల్తాన్లు పరిమితం కావాలి. కానీ వారి దృష్టి ఎప్పుడూ ఉమ్మడి జాబితాలో అధికారాలను రాష్ర్టాలకు అందకుం డా చేయాలనే. రాష్ర్టాలకే పరిమితమైన అధికారాలను కూడా వారికి దక్కకుండా లాక్కోవాలనే. ప్రజాందోళనకు వెరిసి వాపస్‌ తీసుకున్న వ్యవసాయ చట్టాలు ఇదే పని చేశాయి. అన్ని రాష్ర్టాల స్వయం పాలనాధికారాలను రక్షించే బాధ్యతను గంగలో కలిపి జమ్మూకశ్మీర్‌ రాష్ర్టానికి ఉన్న ప్రతిపత్తిని కూడా రద్దు చేశారు! అదీ రాజ్యాంగాన్ని మార్చకుండానే. తర్వాత మిగతా రాష్ర్టాల అధికారాలను కూడా హరిస్తున్నారు.

ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసే దుర్మార్గపు ఆర్టికల్‌-356ను విరివిగా వాడుతున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం దెబ్బతిన్నపుడు రాష్ట్ర శాసనసభను రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించవచ్చనే ఈ విపరీత అధికారపు దుర్వినియోగాన్ని గొంతెత్తి వ్యతిరేకించిన బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్‌ కన్నా దారుణంగా రీతి, నీతి లేకుండా వాడుకుంటున్నది. దానికి ఉదాహరణ ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడమే. దేశ చరిత్రలో మొదటిసారి కేంద్ర ప్రభుత్వం చేతిలో అన్యాయంగా రద్దయిపోయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు వివేచనతో పునరుద్ధరించింది. పీకి పడేయబడిన ముఖ్యమంత్రిని మళ్లీ ఆ పదవిలో కూర్చోబెట్టింది సుప్రీంకోర్టు. ఇది బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణమైన న్యాయ నిర్ణయం. ఇదివరకు 1984లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ప్రజాందోళనలు ఎమ్మెల్యేల సమైక్యత ద్వారా ఎన్టీ రామారావు నెలరోజుల్లో పోయిన పదవి రాబట్టుకోగలిగారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి న్యాయపోరాటం ద్వారా తన పదవిని రక్షించుకున్నారు.

బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రం ఎంత సతాయిస్తున్నదో తెలుసుకోవాలంటే ఢిల్లీలో ఉన్న ఆప్‌ ప్రభుత్వ అష్ట కష్టాలు చూడవచ్చు. అసలే అధికారాల్లేని చిట్టి ప్రభుత్వం అది. ఢిల్లీలో మున్సిపల్‌ మేయర్‌ కన్నా తక్కువ అధికారా లు అక్కడ ముఖ్యమంత్రికి ఉంటాయి. ఆయన్ను రాజకీయంగా ఏడిపించారు. ఎమ్మెల్యేలను దారుణంగా కేసులతో వేధించారు. 20 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దుచేయడానికి ఎన్నికల కమిషన్‌ను కూడా తమ తమ చెప్పుచేతల్లో పనిచేసేట్టు చేశారు. విపరీతమైన కేసులు పెట్టారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న అధికారిని తమ అదుపులో పెట్టుకొని ముఖ్యమంత్రిపైనే కేసులు పెట్టారు. లం చం తీసుకుంటున్న అధికారిపైన చర్య తీసుకునే అధికారం కూడా లేదని సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. ఇవన్నీ సరిపోన ట్టు.. చట్టాలను సవరించి ఢిల్లీ ప్రభుత్వ అధికారాలు ఇంకా తగ్గించారు. ఎన్నికల్లో ఆప్‌ను ఓడించడానికి మత కలహాలు కూడా సృష్టించారు. కేంద్రంలో ఉన్న అధికారాన్నం తా గుమ్మరించారు. కేంద్రమంత్రులు గుంపులుగా ఢిల్లీని ఆక్రమించడానికి ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా ఆశ్చర్యకరంగా జనం ఆప్‌ పార్టీని మళ్లీ గెలిపించారు. ప్రజాస్వామ్యాన్ని ప్రజలే నిలబెట్టారు గాని వేరే ఎవరూ రక్షించలేకపోయారు. అక్కడ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఇప్పటికీ ముఖ్యమంత్రిని ఏడిపించటమే కర్తవ్యంగా పెట్టుకోవాలి, లేకపోతే ఆయన పదవిలో ఉండరు. ప్రతి రాష్ట్రంలో గవర్నర్లను కూడా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ల స్థాయికి కుదించి, ముఖ్యమంత్రిని ఏ అధికారాలు లేని ఢిల్లీ ముఖ్యమంత్రి స్థాయికి దిగజార్చడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది.

మన రాజ్యాంగంలో ఆర్టికల్‌-356 ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల నెత్తిన వేలాడే పెద్ద కత్తిగానే ఉంది. ఏనాడైనా ఢిల్లీలో అధికార పార్టీని వ్యతిరేకించే ఇతర పార్టీలపైన దుర్మార్గంగా ప్రయోగించడానికి ఆర్టికల్‌-356 అనే అస్ర్తాన్ని వాడుకుంటారు. అందుకు అనుకూలురైన గవర్నర్లు ఉంటే చాలు. బీజేపీలో చాలామంది రాజనీతిజ్ఞులు సీనియర్‌ రాజకీయ వేత్తలున్నా వారిని గవర్నర్‌గా నియమించకుండా ఢిల్లీ ప్రభువులు తమ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించి రాష్ర్టాలను సంక్షోభంలోకి నెట్టడానికి ప్రయత్నించే వ్యక్తులను రాజ్‌భవన్‌లలో కూర్చోబెడుతున్నారు. 356 ఆర్టికల్‌ ఆయుధానికి, విధేయ గవర్నర్ల వ్యవహారాలు కూడా తోడైతే రాష్ట్ర ప్రభుత్వాలకు దిన దిన గండమే. గవర్నర్‌ వ్యవస్థ పోవాలని టీడీపీ వ్యవస్థాపకుడు, నేషనల్‌ ఫ్రంట్‌ పేర జాతీయ ప్రతిపక్షాలను ఏకత్రితం చేసిన నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ అనేకసార్లు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఢిల్లీ గేటు ముందు చిప్ప పట్టుకొని ముష్టి ఎత్తుకునే దుస్థితిని కల్పించారన్నారు. కేంద్రం ఒక మిథ్య అనీ, అసలు రాష్ర్టాలు లేకపోతే కేంద్రానికి ఉనికే లేదని సంచలనం సృష్టించారు.ప్రజాప్రతినిధులు, రాజ్యాంగ అధికార పీఠాల్లో ఉన్నవారు తాము ఎందుకు సుల్తాన్‌లు కారో తెలుసుకోవడానికి మన రాజ్యాంగం పీఠిక, మొదటి ఆర్టికల్‌ చదువుకోవాలి. ‘ఇండియా, దటీజ్‌ భారత్‌, ఈజ్‌ యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అని చాటిచెప్పేది మొదటి అధికరణం. దాని అర్థం- ఈ దేశం రాష్ర్టాల సంఘంరా బాబూ అని. రాష్ర్టాలు సంఘంగా ఉంటేనే దేశం ఉంటుంది, దేశ సమైక్యత ఉంటుంది, భారతదేశం అఖండంగా ఉంటుందని చెప్పేది.

ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఈ మధ్య గుర్తుచేసింది. యూనియన్‌ అంటే కేంద్రం కాదు, యూనియన్‌ అంటే రాష్ర్టాల సంఘం. ఢిల్లీలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం కాదు, భారత ప్రభుత్వం కాదు, రాష్ర్టాల సంఘపు ప్రభుత్వం-యూనియన్‌ గవర్నమెంట్‌ అని అర్థం చేసుకుంటే, రాష్ర్టాల అధికారాలు హరించే ఆలోచనలు రావు. కానీ ఇంకా ఫెడరల్‌ వ్యవస్థకు చిల్లులు కొట్టే బిల్లులు సిద్ధంగా ఉన్నాయి.బెంగాల్‌లో మమతా బెనర్జీ గెలిచాక అక్కడి సీఎస్‌ను వెంటనే ఢిల్లీకి తరలించాలని ఢిల్లీ ప్రభువులు ఆదేశించారు. ఒక్కరోజులో రిటైరయ్యే ఆ ఉద్యోగి ఢిల్లీకి వచ్చి సుల్తాన్‌లకు సలాం చేయాలని పట్టుబట్టారు. కానీ అందు కు నియమాలు అనుమతించబోవని తెలిసి, ఆ నియమాలనే చట్టుబండలు చేయాలని ప్రతిపాదించారు. ఎప్పుడంటే అప్పుడు ఏ అధికారినైనా రాష్ట్రం నుంచి ఆగమేఘాల మీద ఢిల్లీకి రప్పించుకోవడానికి వీలుగా నియమాలను మార్చడం ఢిల్లీ సుల్తాన్‌ల తాజా ఫెడరల్‌ వ్యతిరేక ప్రయత్నం.

తెలంగాణ, ఏపీల్లో ప్రవహించే కృష్టా, గోదావరి నదుల మీద కట్టిన, కట్టబోతున్న, మొదలైన, పూర్తిగాని, పూర్త య్యే దశలో ఉన్న అన్ని ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీ సుల్తాన్లు ఆదేశించడం దారుణం. రాష్ట్ర ప్రజల పన్ను ద్వారా పోగయిన సొమ్ము-వేల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులను ఢిల్లీకి ఎందుకు స్వాధీనం చేయాలి? అప్పులన్నీ రాష్ర్టాలు తీర్చాలట! ఆస్తుల నిర్వహణ అంతా ఢిల్లీకి అప్పగించాలట!! ఇది రాజ్యాంగానికి, విభజన చట్టానికి వ్యతిరేకం, భజనకు అనుకూలం. ఈ బడ్జెట్‌లో నదుల అనుసంధానం పేర గోదావరి నీళ్లు తెలుగు రాష్ర్టాలకు అందకుండా తీసుకుపోయే ప్రతిపాదన చేసింది. రాష్ర్టాల అధికారాలను ఢిల్లీ హస్తగతం చేసుకొని ఆ ప్రజా ప్రభుత్వాలను హస్తినాపురం ముందు హస్తాలు ముడుచుకుని మస్తకాలు వంచుకునే దుర్దశ రాకుం డా ఫెడరల్‌ రాజ్యాంగ నియమాలను నీరుగార్చకుండా రాష్ర్టాలు పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ రాజ్యాంగం మార్చాలంటే ఈ ‘యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అనే మౌలిక స్వరూపాన్ని బలోపేతం చేసేందుకే మార్చాలి కానీ మరో రకంగా కాదు.

(వ్యాసకర్త: ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌. డీన్‌, మహింద్రా విశ్వవిద్యాలయ న్యాయ కళాశాల, హైదరాబాద్‌, కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌)

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino