ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికించారు అన్నరు.. ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు సక్రమంగా జరగలేదు అంటున్నారు.. తెలంగాణపై ఎప్పుడు విషం చిమ్మడమే మోదీ పని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.హనుమకొండలో టీ డయాగ్నోస్టిక్, రేడియాలజీ ల్యాబ్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
మొన్న తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారుల బలిదానాలను కించపరిచారు అని కోపోద్రిక్తులయ్యారు. ప్రత్యేక రాష్ట్రం కోసం వరంగల్ జిల్లాకు చెందిన ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చింది? అని ప్రశ్నించారు. వరంగల్‌కు కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు? దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీ ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదు. నవోదయ పాఠశాలలు, ఐఐఎం, ఐఐఐటీ, ఒక్కటి ఇవ్వలేదు. అన్నింటా తెలంగాణకు మొండి చేయి చూపారు అని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.తెలంగాణ అంటే భారతీయ జనతా పార్టీకి కడుపు నిండా విషం ఉంటుందన్నారు.
బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లినయి అని పేర్కొన్నారు. నిధులు ఇవ్వకుండా సూటిపోటి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రం పురోగతిలో ఉంటుంది.. అభివృద్ధి ఆగదు అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధిలో టాప్ 10లో దేశంలో 7 తెలంగాణ గ్రామాలు ఉన్నాయి. వివిధ రంగాల్లో కేంద్రం నుండి అనేక అవార్డులు వచ్చాయి. ఇది మా పని తీరు.. కళ్లకు కనిపిస్తలేదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మోదీ ఇంకో మాట అంటారు.. రాష్ట్రాలు, కేంద్రం కలిసి ఉండాలని.. నీతులు బాగానే చెబుతాడు. కానీ చేతల్లో మాత్రం చూపించరు అని విమర్శించారు.ఎందుకు మా ఏడు మండలాలు ఆదరాబాదరాగా ఆంధ్రాలో కలిపారు. ఎందుకు సీలేరు ప్రాజెక్టు అప్పగించారు. నువు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పా? అని హరీశ్‌రావు నిలదీశారు. మోదీ వ్యాఖ్యలను జర్నలిస్టు సంఘాలు కూడా తీవ్రంగా ఖండించాలి. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.