ఉత్తరాది నాయికలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు ఇకపై వారిని చూడాలంటే హిందీ చిత్రాలకే వెళ్లనక్కర్లేదు. తెలుగు సినిమాల్లోనే బాలీవుడ్ తారల నట ప్రతిభను, అందాన్నీ ఆస్వాదించవచ్చు. ఇప్పటికే కొందరు హిందీ నాయికలు తెలుగులో నటించగా..అక్కడి మరికొందరు ప్రముఖ నాయికలు టాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతున్నారు. ఆ తారలెవరో, ఆ సినిమాల విశేషాలేమిటో చూద్దాం.
రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో అలియా
ప్రతిభ గల బాలీవుడ్ నాయిక ఆలియా భట్ రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటించింది అలియా. ఈ చిత్రంలో సీత పాత్రలో అలియా భట్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ట్రైలర్‌లో అలియా కనిపించిన తీరు, హావభావాలు ఆకట్టుకున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఇచ్చిన క్రేజ్‌తో ఆలియా ఎన్టీఆర్ కొత్త చిత్రంలోనూ నటించనున్నది. ఎన్టీఆర్ నటిస్తున్న 30వ చిత్రంలో అలియా నాయికగా ఎంపికైంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. ఈ వేగం చూస్తుంటే మరికొందరు స్టార్ హీరోల సరసన అలియా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘గని’ జోడీగా సయీ మంజ్రేకర్
వరుణ్‌తేజ్ ‘గని’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నది బాలీవుడ్ తార సయీ మంజ్రేకర్. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో మాయ అనే పాత్రలో కనిపించనుందీ అందాల తార. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ‘గని’ చిత్రాన్ని సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. బాక్సర్ పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నారు.
‘లైగర్’లో అనన్యపాండే
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘లైగర్’. ఈ సినిమాలో బాలీవుడ్ నాయిక అనన్య పాండే నటిస్తున్నది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ చిత్రంతో అనన్య తెలుగులో అడుగుపెట్టినట్లే. హిందీలో ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’, ‘పతీ పత్నీ ఔర్ వో’ చిత్రాలతో ప్రతిభగల గ్లామర్ తారగా పేరు తెచ్చుకుంది అనన్య. ‘లైగర్’ తర్వాత అనన్య తెలుగులో మరిన్ని చిత్రాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రభాస్‌తో ఆడిపాడనున్న దీపికా
ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పడుకోన్ నాయికగా నటిస్తున్నది. ఈ సినిమా దీపికాకు టాలీవుడ్ అరంగేట్రం ఇవ్వనుంది. దీపికా లాంటి బాలీవుడ్ స్టార్ తెలుగు సినిమాలో నటించేందుకు సంతోషంగా అంగీకరించాడనికి ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపుతో పాటు తెలుగు సినిమాకు పెరిగిన ఖ్యాతి కారణం అనుకోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాను తీసుకెళ్లేప్పుడు అలాంటి రేంజ్ కోసం పేరున్న బాలీవుడ్ తారలను తీసుకుంటున్నారు మన దర్శకులు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.
రామ్‌చరణ్ తో రెండోసారి
మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ నాయిక కియారా అద్వాణీ. ఆ తర్వాత రామ్‌చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించి ఆకట్టుకుంది. హుందాతనంతో కూడిన అందం కియారాది. రామ్‌చరణ్ కియారా జోడీ బాగుండటంతో శంకర్ దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రంలోనూ ఆమెనే నాయికగా ఎంపిక చేశారు. చరణ్, కియారా కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.
వరుసలో జాన్వీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా తెలుగులో అరంగేట్రం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నది. తెలుగు సినిమా స్థాయి పాన్ ఇండియా కావడంతో తెలుగు సినిమాలో నటించడం జాన్వీకి తక్కువ ప్రాధాన్యత ఏమీ కాదు. మహేష్ బాబు, ఎన్టీఆర్.. ఇలా కొందరు అగ్ర హీరోలతో జాన్వీ కలిసి నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇంకా అధికారికంగా ఏ ప్రకటన రాలేదు. కానీ జాన్వీకపూర్ టాలీవుడ్ లో ఏదో ఒక మంచి ముహూర్తంలో అడుగుపెట్టడం మాత్రం ఖాయంగా కనిపిస్తున్నది.