ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇకపై తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ.. చెప్పు చూపించి మరీ హెచ్చరించారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. విశాఖలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుపై ఆవేశంతో నిప్పులు చెరిగారు.
గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ మాట్లాడుకుందాం. నేను స్కార్పియోలు కొంటే ఎవరిచ్చారని అడిగారు. గత 8 ఏండ్లలో నేను 6 సినిమాలు చేశా. రూ. 130 కోట్ల ఆదాయం సంపాదించా. రూ. 33 కోట్ల పన్నులు చెల్లించా. నా పిల్లల పేరిట ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు తీసి పార్టీ కార్యాలయం కోసం ఇచ్చాం. రెండు రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ. 12 కోట్లు, అయోధ్య రామాలయం నిర్మాణం కోసం రూ. 30 లక్షలు ఇచ్చాను. పార్టీ పెట్టిన నాటి నుంచి బ్యాంకు ఖాతాల్లో రూ. 15.58 కోట్ల కార్పస్ విరాళాలు వచ్చాయి.
కౌలు రైతు భరోసా యాత్ర కోసం రూ. 3.50 కోట్లు వచ్చాయి. నా సేన కోసం నా వంతుకు రూ.4 కోట్లు అందాయి. ఇంకోసారి ప్యాకేజీ అంటే మర్యాదగా ఉండదు.. చెప్పు తీసుకుని కొడతా. వైసీపీ గూండాల్లారా.. ఒంటి చేత్తో మెడ పిసికేస్తా. నేను అందరినీ గౌరవిస్తా.. కానీ, అవతలి వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని పదేపదే మాట్లాడుతున్నారు. విడాకులు ఇచ్చిన తర్వాత ఇంకొకరిని చేసుకున్నా. చట్ట ప్రకారం వారికి భరణం చెల్లించాను. మొదటి భార్యకు రూ.5 కోట్లు, రెండో భార్యకు ఆస్తి రాసిచ్చాను అని పవన్ వివరించారు.