ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఈ రోజు శనివారం తెలంగాణలో రామగుండంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రికి వ్యతిరేకంగా పట్టణంలో ఫ్లెక్సీలు వెలిసాయి. తెలంగాణకు మోదీ ఇచ్చి హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ గుర్తుతెలియని వ్యక్తులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఐటీఐఆర్ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందని, టెక్స్‌టైల్ పార్కు ఏమైందని, మిషన్ భగీరథకు ఎన్ని నిధులు ఇచ్చారని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికిపోయిందని, డిఫెన్స్ కారిడార్, బయ్యారం స్టీల్‌ప్లాంట్, మెడికల్ కాలేజీలు ఎన్ని ఇచ్చారని, పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని, ఐఐఎం ఏమైందని ప్రశ్నల రూపంలో నిలదీశారు. ఇప్పటికే చేనేతపై విధించిన జీఎస్టీని ఎత్తివేసిన తర్వాత తెలంగాణకు రావాలని పేర్కొంటూ అక్కడక్కడ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలసిన విషయం తెలిసిందే.