రైలు బయలుదేరిన కాసేపటికి ఓ ప్రేమ జంట అందులో నుంచి దూకేసింది. ఈ హఠాత్పరిణామానికి రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన చెన్నై బీచ్‌లో గురువారం రాత్రి చోటుచేసుకోగా.. ప్రేమికుల్లో యువతి అక్కడికక్కడే కన్నుమూసింది. యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీనిని గమనించిన కో పైలట్ రైలును తక్షణమే ఆపేశాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న మాంబళం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదుచేశారు.అందరూ చూస్తుండగానే ఓ ప్రేమ జంట కదులుతున్న రైల్లో నుంచి ఆత్మహత్యాయత్నం చేసిన విషాదకర ఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
చెన్నై బీచ్ మాంబళం నుంచి తాంబరం వరకు రైల్లో బయలుదేరిన ప్రేమికులిద్దరూ మార్గ మధ్యలో ఒకరినోకరు కౌగిలించుకుని కిందకు దూకేశారు. ఈ ఘటనలో ప్రియురాలు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన యువకుడ్ని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చించగా.. పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తోంది.పోలీసుల వివరాల ప్రకారం.. ది తాంబరం చెన్నై కోస్టల్ లైన్.. శివారు ప్రాంతాలు, చెన్నైని కలిపే అత్యంత ముఖ్యమైన రైలు మార్గం. ఈ మార్గంలో రోజూ వందలాది లోకల్ రైళ్లు నడుస్తుంటాయి. ముఖ్యంగా చెన్నై, నగర సబర్బ్‌లకు ఎలక్ట్రిక్ రైళ్లు నడపుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి 8.30 గంటలకు చెన్నై మాంబళం బీచ్ నుంచి తాంబరానికి ఎలక్ట్రిక్ రైలు బయలుదేరింది. ఇదే రైలు ఎక్కిన ప్రేమికులు.. బయలుదేరిన కాసేపటికి కౌగిలించుకుని ముందుకు దూకారు.
యువతి తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది.ప్రియుడు తీవ్ర గాయాలతో రక్తమోడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీనిని గమనించిన కో పైలట్ రైలును తక్షణమే ఆపేశాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న మాంబళం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే యువతి ప్రాణాలు కోల్పోగా.. గాయాలతో ఉన్న యువకుడిని రక్షించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ప్రయాణికులను విచారించారు.ఘటన స్థలిలో ఇరువురి మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైలు నుంచి దూకేయడంతో మొబైల్ ఫోన్లు పగిలిపోవడంతో వాటి కాల్ డేటా కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక విచారణలో యువకుడి పేరును ఇళంగోగా గుర్తించారు. యువతికి వయసు 20 ఏళ్లు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.