లగడపాటి రాజగోపాల్..ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు..తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి లగడపాటి చేసిన రగడ అంతా ఇంతా కాదు…రాష్ట్ర విభజన బిల్లు సమయంలో పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే కొట్టి బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నించిన లగడపాటి సమైక్యాంధ్రలో హీరోగా నిలిచారు. అయితే నాటి సొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లగడపాటి రాజకీయ సన్యాసం చేసేసారు. అయితే ఎన్నికల్లో సర్వేల పేరుతో రాజకీయ పార్టీల గెలుపుఓటములపై జోస్యాలు చెబుతూలగడపాటి. ఆంధ్రా అక్టోపస్ గా పేరుగాంచారు. అయితే .2018 లో తెలంగాణలో మహాకూటమి, ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తారంటూ ఇచ్చిన సర్వేలు తారుమారుకావడంతో ఇక ఎన్నికల సర్వేల పేరుతో జోస్యాలు కూడా తగ్గించారు. సొంత వ్యాపారాలు చూసుకుంటూ రాజకీయంగా సైలెంట్ అయ్యారు.
అయితే తాజాగా విజయవాడలో లగడపాటి అనుచరుల భేటీ అయ్యారు. దీంతో లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి రావచ్చని బెజవాడలో గుప్పుమంటున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో పలు ప్రయివేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న లగడపాటి ఆ తర్వాత మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావును కూడా ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిసారు. . ఇదే సమయంలో లగడపాటి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని…ఆయనకు ఏలూరు నుంచి లోక్ సభ టిక్కెట్ ఇస్తున్నారని కూడా చర్చ జరిగింది. అయితే ఈ విషయంపై ఆయన స్పందించలేదు..తాజాగా బెజవాడలో ఓ హోటల్ లో సమావేశమైన లగడపాటి ముఖ్య అనుచరులు మళ్లీ తమ నాయకుడు రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు…లగడపాటి రాజగోపాల్ వల్లే విజయవాడ గానీ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గానీ అభివృద్ది చెందాయని చెబుతున్నారు…అందుకే ఆయన్నిరీఎంట్రీ ఇచ్చేలా ఒత్తిడి పెంచాలని నిర్నయించారు.ఇకపై పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని లగడపాటి అనుచరులు,కార్యకర్తలను కలుపుకుని సమావేశాలు పెట్టాలని ముఖ్య అనుచరులు భావిస్తున్నారు. .సెప్టెంబర్ నెలాఖరులో తమ నాయకుడిని కలుసుకుని మళ్లీ పోటీలోకి దిగేలా ఒప్పిస్తామంటున్నారు.ఆయన ఎంపీగా పోటీ చేయాలి తప్ప…ఏ పార్టీ అయినా ఆయన ఇష్టం అంటున్నారు. అయితే తాను మాటకు కట్టుబడి ఉంటానని….మళ్లీ రాజకీయాల్లోకి రాలేనని ఆరు నెలల క్రితం నందిగామ వచ్చినప్పుడు కూడా రాజగోపాల్ తెలిపారు.
అయితే అనుచరులు ఒత్తిడితో ఒకవేళ లగడపాటి నిర్ణయం మార్చుకుంటే విజయవాడ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనమే అని చెప్పుకోవచ్చు. లగడపాటి రాజగోపాల్ ప్రస్తుతం వైసీపీ , టీడీపీలకు సమదూరం పాటిస్తున్నారు. ఒకవేళ టీడీపీలో చేరినా ఆయనకు విజయవాడ ఎంపీ టిక్కెట్ ఇస్తారనే గ్యారంటీ లేదు.ఇప్పటికే ఇక్కడ కేశినేని బ్రదర్స్ మధ్య సీటు పోరు నడుస్తోంది.ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గతంలో పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ పార్టీకి దూరంగా ఉండటంతో కొత్త అభ్యర్ధి కోసం చూస్తుంది. కాగా లగడపాటి వైసీపీ వైపు మొగ్గు చూపుతారా లేదా అనే చర్చ కూడా జరుగుతుంది… మొత్తంగా లగడపాటి రాజగోపాల్ బెజవాడ బరిలో దిగితే ఖచ్చితంగా అటు టీడీపీ,ఇటు వైసీపీ ల ఓట్లకు గండికొడతారు అనడంలో సందేహం లేదు. అయితే అనుచరుల ఒత్తిడితో లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా..సైకిలెక్కుతారా లేదా…ఫ్యాన్ కిందా చేరుతారా లేదా జనసేన బీజేపీ కూటమిలో చేరుతారా అనేది చూడాలి.