Home / ANDHRAPRADESH / ఓ మహాత్మా..ఓ మహర్షి..అందుకో మా వందనం…!

ఓ మహాత్మా..ఓ మహర్షి..అందుకో మా వందనం…!

నేడు మన భారత జాతిపిత, పూజ్య బాపూజీ మహాత్మాగాంధీ 150 వ జయంతి..ముందుగా ఆ మహాత్ముడికి నమస్సుమాంజలి ఘటిస్తున్నాము.. మహాత్మాగాంధీ..చిన్నప్పుటి నుంచి చదువుకుంటున్నాం..గాంధీజీ గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు..పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లారు..దక్షిణాఫ్రికాలో బారిష్టర్‌గా పని చేశారు..అక్కడ నల్లజాతీయులపై శ్వేత జాతీయుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు..తిరిగి భారత్‌కు వచ్చి భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు..అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా తెల్లవాడిపై పోరాడారు…సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలతో అహింసామార్గాన భారత స్వాతంత్రోద్యమాన్ని పరుగులు పెట్టించారు..కోట్లాది మంది భారతీయులను ఏకం చేసి తెల్లవాడిని తరిమి కొట్టి అఖండ భారతావనికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ప్రసాదించారు..ఇవన్నీ మనకు చరిత్రలో తెలిసినవే..కానీ ఇదేనా మహాత్ముడు అంటే… కాదు..గాంధీ జయంతి నాడు అందరం ఆయన విగ్రహానికి పూల మాలలు వేస్తాం..ఘనంగా నివాళులు అర్పిస్తాం..కాసేపు గాంధీ గారి గొప్పతనం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నాం..ఆ తర్వాత షరా మామూలే..మన పని మనదే..కానీ ఎంత మంది ఆయన ఆశయాలను పాటిస్తున్నాము..ఎంత మంది గాంధీ చూపిన బాటలో నడుస్తున్నాం..దీనికి మన దగ్గర జవాబు లేదు..గాంధీజీ ఓ వ్యక్తి కాదు..ఓ జీవన విధానం…ఒక మనిషి ఎలా బతకాలో , ఎలా బతక కూడదో ఆచరించి చూపించాడు మన బాపూజీ..ఒక చెంపపై దెబ్బ కొడితే మరో చెంప చూపించిన అహింసావాది..యుద్ధంలో గెలవడమంటే ఎదుటివాడిని చంపడం కాదు.క్షమించడమని చెప్పిన మానవతా వాది..సర్వ జీవుల పట్ల దయ, కరుణ, జాలి ఉండాలని సాటి మానవుడిని ప్రేమించినప్పుడే నువ్వు నిజమైన మనిషివని చాటి చెప్పిన మహోన్పత వ్యక్తిత్వం గాంధీజీ సొంతం..ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ, జీవితాంతం ఓ యోగి పుంగవుడిలా బతికిన యుగ పురుషుడు గాంధీజీ..రోజు రోజుకీ అల్లకల్లోలంగా మారుతున్న ప్రపంచానికి శాంతి సందేశం అందించిన శాంతికపోతం మన గాంధీజీ.

ఈ భూమ్మీద గాంధీజీలాంటి వ్యక్తి రక్తమాంసాలతో నడయాడంటే భవిష్యత్తు తరాలకు నమ్మశక్యంగా ఉండదని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చెప్పిన మాట అక్షరాల నిజమవుతుంది.. మన దేశంలో ఆడబిడ్డలు అర్థరాత్రి పూట ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అన్నారు గాంధీజీ. కానీ మన దేశంలో అర్థరాత్రి ఒంటరిగా కాదు కదా..పట్టపగలు కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లినా ఆడవారి మాన ప్రాణాలకు రక్షణ లేదు..జీవితాంతం సత్యం, అహింస, ప్రేమ, సర్వజీవుల యందు ప్రేమను చాటాడు మహాత్ముడు..కానీ మన దేశంలో ఇంకా అంతా అసత్యమే నడుస్తుంది..నీతి, నిజాయితీల స్థానే అన్ని స్థాయిల్లో అవినీతి రాజ్యమేలుతుంది.. హింస ప్రజ్వరిల్లుతుంది..సర్వ జీవుల పై దాడులు జరుగుతూనే ఉన్నాయి..అంటరాని తనం మహాపాపం అన్నాడు..తానే స్వయంగా హరిజనవాడలలో చీపురు పట్టి మరుగుదొడ్లు పరిశుభ్రం చేశాడు.. కుల, మత , సామాజిక విబేధాలు విడనాడాలని , సమ సమాజ స్థాపన జరగాలని గాంధీజీ బోధించారు. కానీ ఈ దేశంలో ఇప్పటికీ అణగారిన వర్గాల పట్ల అంటరాని తనాన్ని పాటిస్తూనే ఉన్నారు..దళితులపై అగ్రవర్ణాల దాడులు జరుగుతూనే ఉన్నాయి..నానాటికీ కుల, మత అసహనం పెరిగిపోతుంది.ఇప్పటికీ కులాల మధ్య కొట్లాటలు, మతాల మధ్య ఘర్షణలు భరతమాత గుండె మీద గాయాలను చేస్తూనే ఉన్నాయి.

గాంధీజీ ఒక చెంప మీద దెబ్బ కొడితే రెండో చెంప చూపించమన్నాడు..హింసకు అహింసతో బదులు ఇవ్వమని చెప్పాడు.కానీ మనమేం చేస్తున్నాము..ఒక చెంప మీద కొడితే వాడి రెండో చెంప పగులగొట్టడం కాదు కదా..ఆ వ్యక్తిని చంపడానికి కూడా వెనుకాడడం లేదు.. . ప్రపంచం అంతా శాంతిమయం కావాలని విశ్వశాంతికే గాంధీజీ కాంక్షించారు…కానీ ప్రపంచం అంతటా ఉగ్రవాదం జడలు విప్పుతూ అశాంతిమయం అయింది.. స్వతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా ఇంకా గాంధీజీ ఆశయాలు అలాగే ఉండిపోయాయి..గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కలగానే మిగిలిపోయింది..గాంధీ టోపీ పెట్టుకుని గాంధీజీ వారసులు అని చెప్పుకుని తిరిగే నాయకులు ఆయన ఆశయాలను తుంగలో తొక్కుతున్నారు.. ఆశ్రిత పక్షపాతం,అవినీతికి పాల్పడుతూ సగటు భారతీయుడికి టోపీ పెడుతున్నారు.

ఇప్పుడు మన దేశం ఎలా ఉందో తెలుసా..గాంధీజీ మరణించేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అంతకంటే దారుణమైన స్థితిలో ..దేశంలో తీవ్రవాదం, ప్రాంతీయ విభేదాలు, అంటరానితనం, అణగారిన వర్గాలపై దాడులు, ఉగ్రవాదం, రోజు రోజుకీ పెచ్చరిల్లుతున్న హింసావాదం, మత ఘర్షణలు, కులాల కుమ్మలాటలతో మన భారత దేశం కునారిల్లుతుంది. .. ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం..అందరం గాంధీజీ చూపించిన నిష్కల్మషమైన జీవన విధానాన్ని ఆచరించడం..ఆయన చెప్పిన జీవిత సత్యాలను పాటించడం..ఇవన్నీ జరిగే పనేనా..సామాజిక పతనం దిశగా పోతున్న మన దేశానికి మళ్లీ దారి చూపించడానికి ఆ మహాత్ముడే మళ్లీ రావాలేమో..ఓ బాపూ..నువ్వు రావాలి..మళ్లీ నీ సాయం కావాలి అని ఆ మహాత్ముడిని ప్రార్థించడం తప్ప మనకు వేరే మార్గం లేదు.. ఓ మహాత్మా నువ్వు పుట్టి 150 ఏళ్లు అయినా ఇప్పటికీ నువ్వు చూపిన బాటలే..నువ్వు చెప్పిన మాటలే 130 కోట్ల భారతీయులకు దిక్కు అవుతున్నాయి. .నేడు గాంధీజీ జయంతి సందర్భంగా మళ్లీ మన కోసం మరో జన్మ ఎత్తమని ఆ మహాత్ముడిని మనసారా వేడుకుంటుంది…మా దరువు.కామ్ …!