Breaking News
Home / INTERNATIONAL / చైనా అధ్యక్షుడు ఈ కారులోనే ఎందుకు ప్రయాణించాలి..?

చైనా అధ్యక్షుడు ఈ కారులోనే ఎందుకు ప్రయాణించాలి..?

హాంకీ.. ఇది చైనాలో టాప్ కారు. దీన్నే రెడ్ ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు. ఇది ల‌గ్జ‌రీ బ్రాండ్‌ కారు. మావో లాంటి మేటి క‌మ్యూనిస్టు నేతలు ఈ కారులోనే తిరిగారు. సీపీసీ నేత‌లు కూడా ఇప్ప‌టికీ హాంకీనే ప్రిఫ‌ర్ చేస్తారు. అయితే చైన్నైలోని ఐటీసీ చోళా హోట‌ల్ నుంచి మామ‌ల్ల‌పురం వ‌ర‌కు చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ హాంకీ కారులో వెళ్లారు. హాంకీ.. మేడ్ ఇన్ చైనా కారు. హెలికాప్ట‌ర్‌లో వెళ్ల‌కుండా.. జిన్‌పింగ్ సుమారు 53 కిలోమీట‌ర్ల దూరాన్ని కారులో ప్ర‌యాణించారు. దీనికి చైనా అధికారులు ఓ రీజ‌న్ ఇచ్చారు. ఆ దేశ విధానం ప్ర‌కారం.. చైనా నేత‌లు హెలికాప‌ర్ల‌లో వెళ్లడం నిషేధం.

దీన్ని వాళ్లు ఓ రూల్‌గా భావిస్తారు. కేవ‌లం విమానాలు, కార్ల ద్వారా మాత్ర‌మే చైనా నేత‌లు ప్ర‌యాణిస్తార‌ని ఆ దేశ అధికారి ఒక‌రు చెప్పారు. గ‌తంలో జీ20 లాంటి స‌మావేశాల స‌మ‌యంలోనూ.. జిన్‌పింగ్ హెలికాప్ట‌ర్ల‌ను వాడ‌లేద‌ని తెలిసింది. అమెరికా అధ్య‌క్షులు ఎలాగైతే కాడిల్లాక్ బీస్ట్‌లో ప్ర‌యాణిస్తారో.. చైనా అధ్య‌క్షులు కూడా అలాగే హాంకీలోనే వెళ్తుంటారు. నిజానికి శుక్ర‌వారం జ‌రిగిన ఈవెంట్‌కు ప్ర‌ధాని మోదీ.. చెన్నై నుంచి మామ‌ల్ల‌పురానికి హెలికాప్టర్‌లో వెళ్లారు.

2014లో మొద‌టిసారి చైనా అధ్య‌క్షుడు హాంకీ కారును న్యూజిలాండ్ తీసుకువెళ్లారు. హాంకీ ఎల్‌5 కార్ల‌లో ఆయ‌న అక్క‌డ తిరిగారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన సౌత్ఈస్ట్ ఆసియా స‌మావేశాల స‌మ‌యంలోనూ హాంకీ బుల్లెట్‌ప్రూఫ్ లిమినోజ్‌లో తిరిగారు. అంత‌ర్జాతీయంగా చైనా బ్రాండ్‌ను ప్ర‌మోట్ చేయాల‌న్న ఉద్దేశంతో జిన్‌పింగ్ ఈ కారులో ప్ర‌యాణిస్తున్న‌ట్లు తెలుస్తోంది. క‌మ్యూనిస్టు నేత‌లు ఎవ‌రైనా విదేశీ వాహ‌నాల‌ను వాడ‌రాదు అని, కేవలం చైనా త‌యారీ కార్ల‌నే వాడాల‌ని 2012లోనే జిన్‌పింగ్ ఓ చ‌ట్టాన్ని చేశారు.

క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ఐడియాల‌జీకి హాంకీని ఓ సింబ‌ల్‌గా భావిస్తారు. 1958లో చైనా ఆటో వ‌ర్క్స్ గ్రూపు దీన్ని త‌యారు చేసింది. చైనాకు చెందిన ఉన్న‌త అధికారులంతా హాంకీ కారులోనే ప్ర‌యాణిస్తారు. ఆ దేశానికి వ‌చ్చిన విదేశీ నేత‌ల‌ను కూడా ఆ కారులోనే తిప్పుతారు. 1970లో అమెరికా అధ్య‌క్షుడు రిచ‌ర్డ్ నిక్స‌న్ చైనా వ‌చ్చిన‌ప్పుడు .. ఆనాటి నేత మావో ఈ కారునే వాడారు. అయితే 90వ ద‌శ‌కంలో విదేశీ కార్ల మోజులో చైనీయులు హాంకీని ప‌క్క‌న‌పెట్టారు. కానీ 2012లో జిన్‌పింగ్ ఆదేశాల‌తో మ‌ళ్లీ హాంకీ అధికారిక వాహ‌నంగా మారింది. Source: Namasthe Telangana