తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ అయ్యారు. ఆయన బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. నరసింహన్ స్థానంలో ఎవరిని నియమించాలన్నది కూడా సూత్రప్రాయంగా ఖరారు చేసినట్టు అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
తమిళనాడుకే చెందిన మరొకరిని తెలంగాణ గవర్నర్ గా నియమిస్తారని తెలిసింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉన్నాయి. గత కొంతకాలంగా గవర్నర్ బదిలీ విషయంలో ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
వీటన్నింటికీ చెక్ పెడుతూ ఎట్టకేలకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్ గా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా పనిచేసిన రికార్డు నరసింహన్ కు దక్కుతుంది. దీంతోపాటు రాష్ట్రంలో సుదీర్ఘకాలం పనిచేసిన గవర్నర్ గా కూడా ఆయన గుర్తింపు పొందారు.