దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నగరాల నుంచి పల్లెల వరకు వీధివీధినా గణనాధులు పూజలందుకుంటున్నారు. గణేష్ మండపాలన్నీ భక్తులచే కిటకిటలాడుతున్నాయి. ఇక వినాయక చవితి రోజు తొలిపూజలు అందుకున్న వినాయకుడు…తొమ్మిది రోజుల పాటు భక్తులను దీవించనున్నాడు. అయితే మూడవ రోజు నుంచే గణేష్ నిమజ్జనం ప్రారంభమవుతుంది. వినాయకులను 5 వ రోజు, 7 వ రోజు, 9 వ రోజు, 11 వ రోజు ఇలా బేసి సంఖ్య రోజున వినాయకుడిని సమీపంలోని జలాశయంలో నిమజ్జనం చేయడం సంప్రదాయం. ఇలా గణేషుడిని నవరాత్రులు పూజించి వినాయకుడిని నిమజ్జనం చేయడమనే సంప్రదాయం వెనుక ఉన్న పరమార‌్థం ఏంటో తెలుసుకుందాం. బుుతు ధర్మాన్ని అనుసరించి జరుపుకునే పండుగలలో వినాయకచవితి ఒకటి. ఈ పండుగ సరిగ్గా వర్షాకాలంలో వస్తుంది. వినాయక చవితి పండుగ రోజు కచ్చితంగా వర్షం పడుతుందని భక్తుల నమ్మకం. వర్షరుతువులో భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక చవితి పండుగను జరుపుకుంటాం. ఈ సమయంలో మంచి వర్షాలు కురిసి, ఎటూ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. నదులన్నీ ప్రవహిస్తాయి. చెరువులు, వాగులు, వంకలు వంటి జలాశయాలు ఉప్పొంగుతాయి. పుష్పజాతులకు, పండ్ల జాతులకు అనువైన కాలం వర్షకాలం. ఇక వినాయకుడి జన్మనక్షత్రం..హస్తా నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడిని ఆకుపచ్చని వర్ణమంటే చాలా ఇష్టం. ఇక గణనాధుడికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే మనం గణేషుడిని గరికతోను, ఏక విశంతి అంటే 21 రకాల పత్రాలతో పూజిస్తాం. గణేష్ పూజకు రసాయనికి రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి కాలుష్యకారకాలతో చేసే వినాయకుడి ప్రతిమలకు బదులుగా మట్టి వినాయకులను పూజించడం ఈ మధ్య కాలంలో పెరిగింది. గణేషుడి ప్రతిమకు ఒండ్రు మట్టితో చేసిన ప్రతిమను మాత్రమే ఉపయోగిసిస్తారు. దీనికి కారణం..వర్షరుతువులో చెరువులన్నీ పూడికతో ఉంటాయి. వినాయక ప్రతిమల తయారీ కోసం బంకమట్టిని చెరువుల నుంచి తీస్తారు. అందువల్ల చెరువుల్లో పూడిక తీసినట్లు అవుతుంది. పూడిక తీయడం వల్ల చెరువులలో నీళ్లు కూడా స్వచ్ఛంగాఉంటాయి. ఇక మట్టిని తీసి వినాయక ప్రతిమలు చేయడం వల్ల దానిలోని ఔషధ గుణాలు శరీరానికి మేలు చేస్తాయి ఇక పదిరోజుల పాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని పదకొండోరోజున జలాశయాల్లో నిమజ్జనం చేయడం వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. పంచ భూతాల నుంచి జనించిన ఏ పదార్థమైనా అది జీవరాసులైనా, మనుష్యులైనా, పశుపక్ష్యాదులైన , క్రిమికీటకాలైన, రాయి వంటి నిర్జీవ పదార్థమైనా అంతిమంగా మట్టిలో కలిసిపోవాల్సిందే. మధ్యలో ఎంతగా సుఖభోగాలు అనుభవించినా..అంతిమంగా మట్టిలో కలిసిపోవాలన్నదే అన్నదే వినాయక నిమజ్జనం వెనుక ఉన్న పరమార్థం.
Tags devotional festivals Ganesh immerssion lord ganesh vinayaka chaviti