విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందు ధర్మ ప్రచార యాత్రకు వరంగల్ నగరంలో అపూర్వ ఆదరణ లభిస్తోంది. యాత్రలో భాగంగా వరంగల్ నగరంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న దేవి నవరాత్రుల ఉత్సవాలలో స్వామివారు స్వయంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులను ఆశీర్వదించి హిందూ ధర్మ విశిష్టతపై ఉపదేశం ఇస్తున్నారు. వరంగల్ నగరంలో స్థానిక రాధిక థియేటర్ లైన్‌లో రత్నపేపర్ ఏజెన్సీ వారు ఆధ్వర్యంలో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలకు శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, భక్తులను ఆశీర్వదించారు. అలాగే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంజీఎం రోడ్‌లోని రాజరాజేశ్వరీ ఆలయాన్ని సందర్శించిన స్వామివారికి ఆలయ అర్చకులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, భక్తులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారికి స్వామివారు ప్రత్యేకంగా పూజలు చేసి, భక్తులకు దీవెనలు అందించారు. ఈ సందర్భంగా స్వామివారు భక్తులను ఉద్దేశించి ఉపదేశం ఇచ్చారు. ఈ దేవి శరన్నవరాత్రులు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనవని,ఇతిహాసాల్లో అమ్మవారి ప్రాశస్త్యం గురించి విపులంగా వివరించబడి ఉందన్నారు. ఈ దేవి నవరాత్రులను ప్రతి ఒక్కరూ నిష్టతో, పవిత్రతతో జరుపుకోవాలని స్వామివారు పిలుపునిచ్చారు. స్వామివారి ఆగమనం సందర్భంగా భక్తులు వందలాదిగా తరలివచ్చి ఆయన ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారయాత్ర సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
