విశాఖ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు అక్టోబర్ 17, గురువారం నాడు భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని దర్శించారు. స్వామిజీలకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఇరువురు స్వామిజీలు సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో టి. రమేష్ బాబు, అర్చకులు శ్రీ స్వరూపానందేంద్రకు సీతారాముల చిత్రపటాన్ని, ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు మీడియాతో మాట్లాడుతూ, భద్రాద్రి, యాదాద్రి, వేయిస్థంభాల గుడి, భద్రకాళీ వంటి మహిమాన్విత ఆలయాలకు నెలవు తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు ఎంతగానో పాటుపాడుతుందని కొనియాడారు. అయితే అన్యాక్రాంతమవుతున్న దేవాలయాల భూములను పరిక్షించాలని భద్రాద్రి రాముడి పాదాల సన్నిధిలో ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు స్వరూపానందేంద్ర తెలిపారు. భద్రాచలం పుణ్యక్షేత్రానికి విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు విచ్చేయడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి ఆశీస్సులు పొందారు. భద్రాద్రి ఆలయ దర్శనం అనంతరం శ్రీ స్వరూపానందేంద్ర, శ్రీ స్వాత్మానందేంద్ర ఖమ్మం నగరానికి పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచారయాత్ర సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.