Home / BUSINESS / అంబానీ సంచలన నిర్ణయం

అంబానీ సంచలన నిర్ణయం

ఆసియా అపరకుబేరుడు, ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు ముకేశ్‌ అంబానీ (63) మరో కీలక నిర్ణయంపై అడుగులు వేస్తున్నారు. వ్యాపార విస్తరణలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న తన ముగ్గురు సంతానానికి వ్యాపార సామ్రాజ్య వారసత్వ బాధ్యతలను సమానంగా పంచేందుకు రంగంలోకి దిగిపోయారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారంటూ బిజినెస్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

80 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న ఆకాష్, ఇషా , అనంత్ సహా కుటుంబ సభ్యులందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు చేపడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ ప్రణాళికలో భాగంగా ఈ కౌన్సిల్‌లో కుటుంబంలోని పెద్దలు, ముగ్గురు పిల్లలు, సలహాదారులు, సలహాదారులుగా వ్యవహరించే బయటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. కుటుంబం లేదా వ్యాపారాలకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో ఈ కౌన్సిల్ ముఖ్య పాత్ర పోషించనుంది. వచ్చే ఏడాది చివరి నాటికి వారసత్వ ప్రణాళిక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.