Home / SLIDER / బీజేపీ పై బాల్క సుమన్ ఫైర్

బీజేపీ పై బాల్క సుమన్ ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సారథ్యంలో హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, వాటిని బీజేపీ పాలిత రాష్ర్టాలకు తరలించుకుపోయేందుకు ఆ పార్టీనేతలు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఆరోపించారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే భయపడేలా సురక్షితంగా ఉన్న హైదరాబాద్‌లో విద్వేషపూరిత వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు.

తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేతలు గట్టు రాంచందర్‌రావు, పట్లోళ్ల కార్తీక్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపు, దార్శనికతతో ఎవరి ఆటలు సాగనీయరని బాల్క సుమన్‌ స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. 67 వేల కోట్లతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిందని, అందులో కేంద్రం ఎంత వాటా ఇచ్చిందో బీజేపీ నాయకులకు దమ్ముంటే చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రూ.67 వేల కోట్లలో కేంద్రం నుంచి కనీసం 67 పైసలు కూడా తీసుకురాకుండా.. అంతా వాళ్లే చేశారంటూ బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆరేండ్లుగా ప్రశాంతంగాఉన్న నగరంలో బీజేపీ అరాచకాలు సృష్టించాలని, విద్వేషాలు రగిలించాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. హైదరాబాద్‌ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ విజ్ఞతతో ఆలోచించి టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని కోరారు. కులాలు, మతాలు, మనుషుల మధ్య చిచ్చుపెట్టడమే కమలనాథుల అసలు నైజమని అన్నారు.