హుజూరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని, ఈనెల 8న నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగుస్తుందని సీఈవో శశాంక్ గోయల్ చెప్పారు. ప్రతి ఈవీఎంలో 16 మంది అభ్యర్థులు, నోటా ఆప్షన్‌కు అవకాశం ఉంటుందని, నామినేషన్ల సంఖ్య పెరిగితే అదనంగా ఈవీఎంలను సిద్ధం చేస్తామని చెప్పారు.
ఉప ఎన్నిక పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొనడంతో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను కూడా రప్పించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపామని చెప్పారు.
ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశామని శశాంక్ గోయల్ చెప్పారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో.. ఒక పోలింగ్ స్టేషన్‌లో వెయ్యి మందికి మించి ఓటర్లు ఉండకూడదన్న నిబంధన ఉందని, దీనిని కేంద్ర ఎన్నికల సంఘం సడలించనుందని, 1200 మంది ఓటర్ల వరకూ అవకాశం కల్పిస్తే హుజూరాబాద్‌లో అదనపు పోలింగ్ స్టేషన్ల అవసరం ఉండదని వివరించారు.