బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఆశలపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి నీళ్లు చల్లారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రిగా.. కేంద్రం నుంచి విభజన హామీలను సాధించుకొని రావాల్సిన బాధ్యతను విస్మరించి, అది సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో స్టీల్‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్న విషయాన్ని తమ ప్రభుత్వం ఇప్పటికే చెప్పిందని పేర్కొన్నారు.
శనివారం ఆయన తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి అంశంపై హైదరాబాద్‌లోని సీజీవో టవర్స్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విభజన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఏదైనా ఒక ప్రాజెక్ట్‌కు జాతీయహోదా అంశాలపై మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను రాజకీయాలు మాట్లాడాలనుకోవడం లేదని తొలుత సమాధానమిచ్చారు.
రాష్ట్ర విభజన చట్టం తెచ్చే సమయంలో ఎవరూ చూడకుండా.. పూర్తిస్థాయిలో అంచనా వేయకుండా.. స్టీల్ ఉత్పత్తికి సంబంధించి వనరుల లభ్యత ఉన్నదా? లేదా? అన్నది తెలుసుకోకుండానే నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్, ఇతర రాష్ర్టాల నుంచి రా మెటీరియల్ తెచ్చి, బయ్యారంలో ఉత్పత్తి చేస్తే అది మార్కెట్ ధరకంటే ఎక్కువ అవుతుందని చెప్పుకొచ్చారు. ప్రైవేట్ సెక్టార్‌లో తక్కువ ధరకే స్టీల్ దొరుకుతుంటే, ఎక్కువ ధర పెట్టి బయ్యారం స్టీల్‌ను ఎవరు కొంటారని ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుంటే పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పడం గమనార్హం.