సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హనుమకొండ సభలో ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్ చదివారని ఎద్దేవా చేశారు. వరంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాహుల్ గాంధీ పొత్తుల గురించి మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేవారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. పొత్తు కావాలని ఆ పార్టీని ఎవరైనా అడిగారా? అని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు లేదు.. నిరంతర విద్యుత్తు లేదు.. రైతు బీమా లేదు అని కేటీఆర్ ఆక్షేపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయాన్ని కాంగ్రెస్ పార్టీ సంక్షోభంగా మారిస్తే.. కేసీఆర్ దాన్ని గొప్ప శక్తిగా చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప రైతు పార్టీ అయితే పంజాబ్‌లో ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు.