సహజంగా గర్భధారణ సమయంలో నెలలు నిండుతున్నకొద్దీ పొట్ట సాగుతూ వస్తుంది. పాపాయి బరువును ఆపేలా ఆ భాగం దృఢపడుతుంది కూడా. కానీ, ప్రసవం తర్వాత ఒక్కసారిగా పొట్ట ఖాళీ అవుతుంది. సంచిలా అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే, కడుపు అంత పెద్దగా కావడానికి తొమ్మిది నెలల సమయం పడుతుంది.
అలాగే, పురిటి తర్వాత సాధారణ స్థితికి రావడానికి కూడా కొంత సమయం అవసరం. కానీ తప్పక తగ్గుతుంది. తగ్గలేదూ అంటే, మన నిర్లక్ష్యమే కారణం. సిజేరియన్, సాధారణ ప్రసవం.. ఏదైనా సరే బిడ్డ పుట్టిన ఆరు వారాల తర్వాత నుంచి వ్యాయామాలు ప్రారంభించాలి. పొత్తి పొట్టకు సంబంధించిన వివిధ ఎక్సర్‌సైజులు ఇప్పుడు యూట్యూబ్‌లాంటి మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయి.
మంచి ట్రెయినర్ సాయంతోనూ ఈ వ్యాయామాలు చేయవచ్చు. యోగా కూడా పొట్ట యథాస్థితికి చేరేందుకు సాయపడుతుంది. కొంతమంది డెలివరీ అయ్యాక బెల్టువాడాం, పొట్ట తగ్గలేదని చెబుతుంటారు. బెల్టు అనేది పొట్ట కండరాలకు సపోర్ట్‌గా ఉంటుంది. దానివల్ల తగ్గే అవకాశమే లేదు. ఒక్క వ్యాయామంతోనే పురిటి తర్వాత పొట్టను తగ్గించుకోగలరు. అంతేకాదు, చక్కని పోషకాహారమూ తీసుకోవాలి.